Read more!

కాంగ్రెస్ మార్క్ రాజకీయాలతో చిరంజీవి కాలక్షేపం

 

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్షం నాయకుడిగా ఎన్నికయిన కే.జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీ సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని పణంగా పెట్టి మరీ తెలంగాణను ఏర్పాటుచేసిందని, అందుకు ధన్యవాదాలు తెలియజేసుకొంటునానని అన్నారు. సోనియాగాంధీ తెలంగాణా కోసం కాంగ్రెస్ పార్టీనే కాదు, తనను ఇంత కాలం నెత్తిన పెట్టిన మోసిన సీమాంధ్ర ప్రజలను, వారి భవిష్యత్తును కూడా పణంగా పెట్టారు. కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం, రాష్ట్రాన్ని రెండుగా విభజించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేతిలో చిల్లి గవ్వ లేకుండా నడిరోడ్డు మీద వదిలిపెట్టింది.

 

నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుపుకొనేందుకు భవన సముదాయాల కోసం వెతుకోవడం చూస్తుంటే ఆంధ్ర ప్రజల కడుపు తరుక్కుపోతోంది. ఒకప్పుడు దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేడు ఈ దుస్థితి ఏర్పడటానికి కారణం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే. అందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు ప్రజలు ఎన్నికలలో గట్టిగా బుద్ది చెప్పినప్పటికీ, వారిలో ఏ మాత్రం పశ్చాతాపం కనబడకపోవడం చాలా విచిత్రం. పైగా ముంజేతి కంకణంలా వారి ఓటమికి కారణం స్పష్టంగా కనబడుతుంటే, అది తెలియనట్లు వారందరూ తమ ఓటమికి కారణాలు విశ్లేషించుకోవడం ఆత్మవంచన చేసుకోవడమే.

 

రాష్ట్ర విభజన దెబ్బకి కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోవడంతో, తంతే బూర్లె గంపలో పడినట్లుగా రాత్రికి రాత్రి మెగా కాంగ్రెస్ నేతగా ఎదిగిపోయిన చిరంజీవి, తాము సోనియాగాంధీని కలిసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడమని కోరామని అందుకు ఆమె తక్షణం స్పందించి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ వ్రాసేసారని గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదం. వెనకటికి ఒక ముసలమ్మ నా కోడి కూయకపోతే లోకానికి తెల్లారదన్నట్లే ఉన్నాయి చిరంజీవి మాటలు. ఆయన, జేడీ శీలం వంటి మరికొందరిని వెంటబెట్టుకొని డిల్లీ వెళ్లి సోనియాగాంధీని కలిసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడమని అర్దించడం, అందుకు ఆమె ఎంతో ఉదారంగా అంగీకరిస్తూ మోడీకి లేఖ వ్రాయడం, మళ్ళీ ఆవిషయం మీడియాను పిలిచి మరీ గొప్పగా చెప్పుకోవడం చాలా నవ్వు తెప్పిస్తోంది.

 

చిరంజీవి సోనియా గాంధీని అడగకపోతే మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయం చేయరా? లేక సోనియా గాంధీ మోడీకి లేఖ వ్రాయకపోతే, మోడీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గాలికొదిలేస్తుందా? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోయిన తరువాత, చిరంజీవికి, కాంగ్రెస్ నేతలకు పనేమీ లేకుండా పోయింది. అప్పటికీ ఓటమికి కారణాలు కనిపెట్టుకొనే మిషతో ఇన్ని రోజులు కాలక్షేపం చేసినప్పటికీ, రాజకీయాలలో ఉన్నపుడు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం నిత్యం మీడియాలో కనబడాలి కనుకనే చిరంజీవి ఈ డ్రామా ఆడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

అయితే చిరంజీవితో సహా రాజకీయ నాయకులందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఎన్నికలు రానంత వరకు వారెన్ని డ్రామాలు ఆడినా ప్రజలు అమాయకంగా మొహాలు వేసుకొని చూస్తూనే ఉంటారు. చప్పట్లు కూడా కొడుతుంటారు. కానీ ఎన్నికలలో మాత్రం వారందరికీ తగిన గుణపాటం నేర్పిస్తారని గ్రహించాలి. జరిగిన దానికి చిరంజీవి వంటి కాంగ్రెస్ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పకపోయినా పరువలేదు. పశ్చాతాపపడకపోయినా పరువాలేదు. కానీ ఆత్మవంచన చేసుకొంటూ, ఈవిధంగా ‘కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు’ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదని గ్రహిస్తే వారికే మంచిది.

 

ఇప్పుడు ప్రజలలో రాజకీయ చైతన్యం చాల పెరిగింది. ఇప్పుడు ప్రజలు సుపరిపాలన, అభివృద్ధి, సమర్ధతకే ప్రాధాన్యం ఇస్తున్నారనేందుకు మొన్న జరిగిన ఎన్నికలే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అయినప్పటికీ చిరంజీవి వంటి కాంగ్రెస్ నేతలు ‘కాంగ్రెస్ మార్క్ రాజకీయాలే’ కంటిన్యూ చేద్దామనుకొంటే వారినెవరూ వద్దనరు.