పెరటి మొక్క వైద్యానికి పనికి రాదన్నట్లు
posted on Apr 13, 2014 @ 12:18PM
పెరటి మొక్క వైద్యానికి పనికిరాదనే ఒక సామెత అక్షరాల చిరంజీవికి సరిపోతుంది. ఆయన తన మెగా చరిష్మాతో సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీని ఒడ్డున పడేస్తాడని ఆశతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకి ఎన్నికల ప్రచారకమిటీ చైర్మన్ గా కీలక బాధ్యతలు అప్పగించింది. అవసరమయితే ఆయనను ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా పంపి ప్రచారం చేయించుకోవాలనుకొంది. అయితే ఆయన సీమాంద్రా ప్రజలనే ఆకట్టుకోలేనప్పుడు ఇతర రాష్ట్రాలలో మాత్రం ఏమి సాధిస్తారని అందరూ పెదవి విరుస్తున్నారు. పొరుగు రాష్ట్రాల సంగతి తరువాత చూసుకోవచ్చును, కనీసం నేటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగానే ఉన్న తెలంగాణాకు ఆయనను పంపి ప్రచారం చేయించుకొనే దైర్యం చేయలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ.
ప్రస్తుతం టీ-కాంగ్రెస్ లో ప్రజాకర్షణగల సరయిన నేతలెవరూ లేకపోవడంతో, వారందరూ కలిసి కూడా ఒక్క కేసీఆర్ని గట్టిగా డ్డీ కొనలేక ఆపసోపాలు పడుతున్నారు. వారిని ఎదుర్కోవడానికి డిల్లీ నుండి జైరామ్ రమేష్ స్వయంగా రావలసి వచ్చిందంటే టీ-కాంగ్రెస్ పరిస్థితి అర్ధమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణాను వ్యతిరేఖించిన చిరంజీవిని ప్రచారానికి ఆహ్వానిస్తే అది కొరివితో తలగోక్కునట్లే అవుతుందని కాంగ్రెస్ నేతలకు తెలుసు. అందుకే సరయిన ప్రజాకర్షక నేతలు ఎవరూ లేకపోయినప్పటికీ టీ-కాంగ్రెస్ నేతలు అలాగే ఎలాగో నెట్టుకొస్తున్నారు తప్ప తమ పెరట్లోనే ఉన్న చిరంజీవి గురించి ఎన్నడూ ఆలోచించలేదు.