తిక్కుంది కానీ దానికో లెక్క లేదు
posted on Apr 13, 2014 @ 10:16AM
నా కొంచెం తిక్కుంది..కానీ దానికో లెక్కుంది…అని పవన్ కళ్యాణ్ డైలాగ్ చాలా పాపులర్ అయింది.సరిగ్గా ఎన్నికల ముందు పార్టీ పెట్టి రాజకీయాలలో ప్రవేశించిన ఆయన “తూచ్...ఇప్పుడు పోటీ చేయబోవడం లేదు. అందువల్ల జనాలూ..మీకు నచ్చినోళ్ళకే ఓట్లేసేసుకోండి!” అని వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించేసారు. విజయవాడ టికెట్ కోసం అన్ని పార్టీల గడపలు ఎక్కిదిగిన పొట్లూరి వరప్రసాద్, అందు కోసం బోలెడంత డబ్బు ఖర్చు చేసి పవన్ కళ్యాణ్ చేత జనసేన లాంచింగ్ చేయించగలిగారు కానీ ఆయన చేత ఎన్నికలలో పోటీ చేయించ లేకపోయారు. అయితే గజ్జి ఉన్నవాడికి అలా గోక్కొంటూ ఉంటేనే చాలా సుఖంగా ఉంటుందిట. అలాగే విజయవాడ నుండి లోక్ సభకు పోటీ చేయాలని తహతహలాడిపోతున్న పొట్లూరికి ఏదో విధంగా అక్కడి నుండి ఓసారి పోటీ చేసి మళ్ళీ చేతులు కాల్చుకొంటేనే కానీ ఆ దురద తీరేట్లు లేదు. అందుకే ఆయన టికెట్ కోసం పవన్ వెంటబడ్డారు. కానీ వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించేసిన తరువాత మళ్ళీ రంగ ప్రవేశం చేసి, తన అభ్యర్ధిని పోటీలో దింపి ఓడిపోతే ఉన్న పరువు కూడా పోయే ప్రమాదం ఉంది గనుక, తను (కోడ్ బాషలో) మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన తెదేపాకు ఎన్నికల సందర్భంగా ఒక మెగా బంపర్ ఆఫర్ ఇచ్చారు. పొట్లూరికి ఒక టికెట్ ఇస్తే వన్ ప్లస్ వన్ ఆఫర్ క్రింద తెదేపా-బీజేపీ రెండు పార్టీలకు ఫ్రీగా ప్రచారం చేసిపెడతానని టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చారు.
ఆ రెండు పార్టీలు పొత్తులయితే పెట్టుకోగలిగాయి కానీ నేటికీ సీట్ల సర్దుబాటు చేసుకోలేక తలలు పట్టుకొని కూర్చొన్నాయి. ఉన్న ఐదు రోజుల పుణ్యకాలంలో అప్పుడే ఒకరోజు గడిచిపోయింది కానీ వైజాగ్, విజయవాడ సీట్ల బేరం మాత్రం ఎంతకీ ఒక కొలిక్కి రావడం లేదు. ఆ రెండు సీట్లు కోసం ఆ రెండు పార్టీలు సిగపట్లు పడుతుంటే మధ్యలో పొట్లూరికి టికెట్ అంటూ పవన్ కూడా వారితో జాయిన్ అయ్యారు. తమ వాళ్ళని కాదని పొట్లూరికి టికెట్ కట్టబెడితే ఇక ఆ రెండు పార్టీలలో ముసలం పుడుతుంది. ఇవ్వకపోతే పవన్ ‘జై జనసేన’ అంటూ పొట్లూరిని పోటీలో నిలబెడితే అదొక పెద్ద సమస్య అవుతుంది.
రాష్ట్ర, దేశ, ప్రపంచ రాజకీయాల గురించి చిన్నపుడు నుండే సుదీర్గ పరిశోధన చేసి, ప్రపంచంలో ఉన్న అన్ని ఇజాలను మిక్సీ గ్రైండర్ లో వేసి రుబ్బి మరో కొత్త ఇజం కనిపెట్టిన పవన్ కళ్యాణ్, విజయవాడ టికెట్ కోసం ఆ రెండు పార్టీల కుస్తీ పట్ల గురించి తెలుసుకోలేకపోవడం విచిత్రమే. అయినా ఆయన స్వంత కుంపటిని వంటింట్లో దాచుకొని, పొరుగింటి పిన్నిగారి కుంపటి మీద గారెలు, పరమాన్నం వండుకోవాలనుకోవడం విడ్డూరంగానే ఉంది కదా! నిజమే.. అతనికి తిక్కయితే ఉంది గాని దానికో లెక్క మాత్రం లేదని జనాలు కూడా ముసిముసి నవ్వులు నవ్వుకొంటున్నారు.