త్వరలో కాంగ్రెస్ నేతల రిటర్న్ జర్నీ?
posted on Apr 13, 2014 @ 2:04PM
ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నుండి గుంపులు గుంపులుగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిపడిన కాంగ్రెస్ నేతలకు చంద్రబాబు షాక్ ఇస్తున్నారు. వారిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయనతో బాటు వచ్చిన నలుగురు విశాఖ కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఇంతవరకు వెలువరిచిన రెండు జాబితాలలో వారెవరి పేర్లు కనబడకపోవడంతో అందరిలో ఆందోళన మొదలయింది. ఇంకేముంది.. అందరూ అసమ్మతి గంట కొట్టేందుకు శ్రీనివాసరావు ఇంటిలో సమావేశమయిపోయారు.
వారిలో అవంతీ శ్రీనివాస్, కన్నబాబు తమకు టికెట్స్ దొరక్కపోతే పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసేందుకు సిద్దమని చెపుతుంటే, గాజువాక యం.యల్యే. వెంకట్రామయ్య తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిపోయెందుకు చిరంజీవి, బొత్స సత్యనారాయణలతో అప్పుడే చర్చలు కూడా ఆరంబించేసారు. సీమాంద్రాలో పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోవడంతో ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్ధులు లేక దిక్కులు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆయనకు మళ్ళీ గాజువాక నుండి టికెట్ ఇచ్చేందుకు అంగీకరించినట్లు తాజా సమాచారం.
అయితే చిరంజీవి అనుంగు సహచరుడు గంటా శ్రీనివాసరావు మాత్రం తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్దంగాలేరు. చంద్రబాబు తనని ఎక్కడి నుండి పోటీ చేయమన్నా అభ్యంతరం చెప్పకుండా పోటీ చేస్తానని, ఒకవేళ టికెట్ ఇవ్వకున్నా కూడా తెదేపానే అంటి పెట్టుకొని ఉంటూ పార్టీ నిలబెట్టిన అభ్యర్ధుల విజయానికి కృషి చేస్తానని చంద్రబాబుకి వినబడేలా బిగ్గరగా చెపుతున్నారు. గంటా శ్రీనివాసరావు ప్రదర్శిస్తున్న ఈ లౌక్యాన్ని చూసి చంద్రబాబు ఐస్ అయిపోయి టికెట్ ఇస్తారో లేదో నేడో రేపో తేలిపోతుంది.
అయితే ఇదంతా చూస్తుంటే చంద్రబాబు రాష్ట్ర విభజన వ్యవహారంతో తనను తన పార్టీని ఘోరంగా దెబ్బతీయాలని చూసిన కాంగ్రెస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకోనేందుకే ఆ పార్టీ నేతలని తెదేపాలోకి ఆకర్షించారా? అందుకే నామినేషన్లకు గడువు ముగిసేవరకు వారి టికెట్స్ వ్యవహారం ఎటూ తేల్చకుండా నాన్చుతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆయన ప్రకటించిన రెండు జాబితాలలో కలిపి కేవలం నలుగురైదుగురు కాంగ్రెస్ నేతలకు మాత్రమె టికెట్స్ వచ్చాయి. కానీ, కాంగ్రెస్ నుండి తెదేపాలోకి వచ్చిన వారి సంఖ్యా దాదాపు రెండు డజన్ల పైనే ఉన్నారు. మరి వారందరికీ కూడా చంద్రబాబు ఆఖరి నిమిషంలో హ్యాండివ్వబోతున్నారా?అనే సంగతి కూడా నేడో రేపో తుది జాబితా వెలువడగానే తేలిపోతుంది. అది కూడా తేలిపోతే కాంగ్రెస్ నేతలందరూ ‘ద్వారములు తెరిచియే ఉంచిన కాంగ్రెస్ గూటికి’ బిరబిరా పరుగులు తీస్తారేమో!
ఈలోగా కాస్త ముందు చూపు ఉన్న కన్నబాబు, అవంతీ శ్రీనివాస్ వంటి నేతలు స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్లు వేసి జాగ్రత్తపడుదామని భావిస్తుంటే, అంత రిస్కు తీసుకోవడం ఇష్టంలేని వెంట్రామయ్య వంటి నేతలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొనే ప్రయత్నంలో తమకు టికెట్ రాదని గ్రహించగానే కాంగ్రెస్ గూటికి తిరిగి పయనమయిపోతున్నారు. ఇంతకీ వీరందరిలో ఎవరు తెలివయిన వారు? కాంగ్రెస్ నేతలకి పసుపు కండువాలు కప్పి వారికి షేక్ హ్యాండిస్తున్న చంద్రబాబా? లేక అవకాశవాదులయిన కాంగ్రెస్ నేతలా?