వైఎస్సార్ సంస్మరణ సభ.. విజయమ్మ ఫిట్టింగ్.. వైసీపీలో టెన్షన్...
posted on Aug 31, 2021 @ 2:02PM
సెప్టెంబర్ 2. వైఎస్సార్ మరణించిన రోజు. వైఎస్ 12వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ హైదరాబాద్‌లో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఇదే ఇప్పుడు వైసీపీ నేతల్లో కలవరపాటు పెంచుతోంది. వైఎస్సార్ పేరతోనే పార్టీ పెట్టుకొని.. వైఎస్ బొమ్మ చూపించి.. ఓట్లు దండుకొని.. ఆయన పేరుతో పథకలు పెట్టి.. రాజకీయం చేసే వైసీపీ నాయకులు ఇప్పుడు తమ ప్రియతమ నేత, దివంగత రాజశేఖర్‌రెడ్డి వర్ధంతికి వెళ్లాలా? వద్దా? అని తేల్చుకోలేని దుస్థితిలో ఉండటం శోచనీయం. ఇంతకీ వారికి అంత ఇబ్బంది ఏమొచ్చింది? విజయమ్మ నిర్వహించే వైఎస్సార్ వర్ధంతికి వెళితే సమస్యేంటి? వైసీపీ నేతలకు వచ్చిన ఇరకాటమేంటి?
ఎందుకో ఏమో కానీ.. ఇన్నేళ్లూ ఇడుపులపాయలో వైఎస్ సమాధికి దండేసి.. బొకే ఉంచి.. కాసేపు ప్రేయర్ చేసి సరిపెట్టే విజయమ్మ.. ఈసారి మాత్రం అనూహ్యంగా వైఎస్సార్ సంస్మరణ సభ అంటూ పెద్ద ప్రోగ్రామే కండెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడే ఇలా అట్టహాసంగా ఎందుకు సభ పెడుతున్నారో ఆమెకే తెలియాలి. వర్థంతి సభకు ప్రస్తుతం వివిధ పార్టీల్లో ఉన్న ఆనాటి వైఎస్సార్ కేబినెట్ సహచరులందరినీ ఆహ్వానించారు. ఇన్విటేషన్ అందుకున్న వారిలో వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో ఉన్న పలువురు కీలక నేతలు ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామం అందరికంటే వైసీపీ నేతలకే మరింత ఇబ్బందిగా మారిందంటున్నారు.
జగన్-షర్మిల మధ్య విభేదాలు వచ్చి.. చెల్లి అలిగి అత్తగారి రాష్ట్రానికి వెళ్లిపోయింది. అక్కడ వైఎస్సార్‌టీపీ పేరుతో వేరు కుంపటి పెట్టుకుంది. విజయమ్మ కూతురికే సపోర్ట్‌గా ఆమెకు దన్నుగా నిలిచింది. తల్లి-చెల్లి లేని ఒంటరి పక్షిగా మిగిలారు జగనన్న. ఇటీవల ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతికీ పరస్పరం ముఖాలు చూసుకోలేనంత వైరం పెరిగిందని అంటున్నారు. అలాంటిది వైఎస్సార్ పేరుతో విజయమ్మ నిర్వహిస్తున్న సంస్మరణ సభకి జగన్ వస్తారా? రారా? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. వస్తే కుటుంబమంతా ఒక్కటే.. ఇప్పటిదాకా ఆడిందంతా ఫ్యామిలీ డ్రామా అని తేలిపోతుంది. రాకపోతే.. తండ్రి పేరు మీద తల్లి నిర్వహించిన సభకు.. జగన్ రాలేదని అంతా ఆడిపోసుకుంటారు. వైఎస్ బొమ్మతో ఓట్లు దండుకొని.. ఇప్పుడు తండ్రి సంస్మరణ సభకే వెళ్లని సుపుత్రుడని అబాసుపాలవుతారు. వెళితే ఒక ప్రాబ్లమ్.. వెళ్లకపోతే మరింత ఇరకాటం. ఇలా జగన్ పరిస్థితి అడకత్తరలో పోకచెక్కలా మారిందంటున్నారు. అయితే.. ఇంతకీ ఆ సభకు జగన్‌కు ఇన్విటేషన్ ఇంకా రాలేదని.. అసలు వస్తుందో రాదో కూడా తెలీదని చెబుతుండటం మరింత ఆసక్తికరం.
జగన్ మేటర్ పక్కనపెడితే.. పలువురు వైసీపీ నేతలకు మాత్రం ఆహ్వానాలు అందాయి. మరి, వారైనా వెళతారా? లేదా? అంటే ఏమో అనే సందేహం. వెళితే జగన్ ఏమనుకుంటారో.. వెళ్లకపోతే విజయమ్మ, వైఎస్ అభిమానులు ఏమనుకుంటారో.. ఇలా వైఎస్సార్ సభ వైసీపీ నేతలకు కొత్త తలనొప్పులు తీసుకొస్తుందని అంటున్నారు. అయితే, ఇప్పటికైతే జస్ట్ ఎస్ఎంఎస్‌లు మాత్రమే వచ్చాయని.. విజయలక్ష్మి నేరుగా పిలిస్తే అప్పుడు చూడొచ్చని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేరే పార్టీల్లో ఉన్న పలువురు నేతలు ఆహ్వానాలు అందుకున్నా.. ఆ సభకు వెళ్లడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. వాళ్లు వెళ్లినా వెళ్లకపోయినా పెద్దగా ప్రభావం ఉండదు కానీ.. వైసీపీ నేతలే ఏం చేసినా అది వారికి ఏదో ఒకరకంగా ఇబ్బందికరంగా మారొచ్చు. విజయమ్మ భలే ఫిట్టింగ్ పెట్టిందిలే అని తెగ ఇదైపోతున్నారట వారంతా.