Read more!

చిన్నారి మనసుకి గాయం అయితే


పిల్లల్ని పెంచడం ఒక కళ అని చాలామంది గ్రహించరు. పిల్లలకి కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుందన్న ఆలోచనా కొద్దిమందికే ఉంటుంది. ఇక పిల్లల మనసు గాయపడితే వారి జీవితం ప్రభావితం అవుతుందన్న ముందుచూపూ జనానికి తక్కువే! కానీ అలాంటి అలక్ష్యమే వారి నిండు జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

 

రకరకాల బాధలు

పిల్లలు పసివారే కావచ్చు. కానీ వారి మీద జరిగే దారుణాలు అసంఖ్యాయం. తెలిసో తెలియకో కుటుంబం, సమాజం వారితో ప్రవర్తించే తీరు అమానుషంగానే ఉంటుంది. శారీరిక హింస, మానసిక వేధింపులు, లైంగిక దాడులు, తల్లిదండ్రులు విడిపోవడం, ఇంట్లో గొడవలు లాంటి వ్యవహారాలు పసి మనసుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అందుకనే అమెరికాలోని ఓ స్వచ్ఛంద సంస్థ 17,000 మందిని ప్రశ్నించినప్పుడు... వారిలో చాలామంది తాము ఏదో ఒక సందర్భంలో తీవ్రమైన వేధింపులకి గురైనట్లు పేర్కొన్నారు. వీటిలో శారీరిక హింసదే అగ్రస్థానంగా ఉంది.

 

దీర్ఘకాలిక ప్రభావం

చిన్నతనంలో పసిమనసు దెబ్బతింటే దాని ప్రభావం దీర్ఘకాలికంగా ఉన్నట్లు తేలింది. వారిలో గుండె జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, కాలేయ సమస్యలు, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందట. ఇక డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యలు సరేసరి! అపసవ్యమైన బాల్యాన్ని చవిచూసిన వారిలో ప్రవర్తనాపరమైన లోపాలకీ కొదవ లేదు. దుర్వసనాలకు లోనుకావడం, విచ్చలవిడితనం, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం వంటి జీవనానికి అలవాటుపడతారట. సాధారణ వ్యక్తులతో పోలిస్తే, గాయపడిన మనసుతో బాల్యాన్ని గడిపిన వారి ఆయుష్షులో కూడా మార్పులు ఉండటాన్ని గమనించారు. వీరు దాదాపు 20 సంవత్సరాలు ముందే చనిపోయే ప్రమాదం ఉందట. వీరిలో ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా ఐదురెట్లు అధికంగా జరిగినట్లు గమనించారు.

 

ఇవీ కారణాలు

తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం పసిపిల్లలలో ఉండదు. కనీసం దానిని బయటకు చెప్పుకునే ధైర్యాన్ని కూడా వారు చేయలేరు. ఏ పెద్దల మీదైతే తాము ఆధారపడుతున్నామో... వారే సమస్యగా మారినప్పుడు, సమాజం మీదే వారికి నమ్మకం పోతుంది. అనుబంధాల మీదా, మానవత్వం మీదా విశ్వాసం చెదరిపోతుంది. అది మానసికంగానూ, శారీరికంగానూ, ప్రవర్తనాపరంగానూ వారి మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

 

అదృష్టవశాత్తూ ఇప్పుడు పిల్లల హక్కుల గురించీ, వారి మనస్తత్వాల గురించీ విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఎవరన్నా తన చిన్నతనం తాలూకు జ్ఞపకాలూ ఇంకా తమని వెన్నాడుతున్నట్లు భావిస్తే ధ్యానం చేయడం ద్వారా, కౌన్సిలింగ్‌ తీసుకోవడం ద్వారా ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.

 

- నిర్జర.