చిదంబరం రాజీనామాపై లోక్ సభలో గందరగోళం
posted on Dec 20, 2011 @ 1:07PM
న్యూఢిల్లీ : లోక్ సభలో మంగళవారం గందరగోళం నెలకొంది. చిదంబరం రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్షాలు చిదంబరం రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశాయి. ఆయన మాట్లాడుతున్న సమయంలో బిజెపి అడుగడుగునా అడ్డు తగిలింది. రాజీనామా చేసే వరకు వెనక్కి తగ్గేది లేదన్నది. చిదంబరం సభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ఆయనపై బిజెపి నేత యశ్వంత్ సిన్హా సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఢిల్లీలో ఓ హోటల్ యజమాని చీటింగ్ కేసులోనూ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా రాజ్యసభలోనూ చిదంబరానికి వ్యతిరేకంగా విపక్షాలు నినాదాలు చేశాయి.
మరోవైపు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. కరవు, వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు నష్ట పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయం రద్దు చేసి రైతు సమస్యలపై చర్చ చేపట్టాలని టిడిపి నోటీసు ఇచ్చింది.
కాగా కేంద్ర కెబినేట్ లోక్‌పాల్ బిల్లుపై ఈ రోజు భేటీ కానుంది. ఈ భేటీలో సిబిఐ, ప్రధానమంత్రిని లోక్‌పాల్ పరిధిలోకి తెచ్చే అంశంపై చర్చిస్తారు. బిల్లుపై కేబినెట్లో పూర్తిగా చర్చించిన తర్వాత సభలో ప్రవేశ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజే బిల్లు ప్రవేశ పెట్టాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడే అవకాశముంది.