అక్రమ మద్యంపై సీఎం ఎందుకు నోరువిప్పట్లా? బాబు
posted on Dec 20, 2011 @ 1:15PM
హైదరాబాద్: అక్రమ మద్యంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు నోరు విప్పడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో మంచినీటి కొరత ఉంది కానీ మద్యానికి ఏ మాత్రం కొరత లేదని అన్నారు. మద్యం మాఫియాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు తెలిపారు. మద్యం సిండికేట్లపై చర్చించేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యాన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వమే మద్యాన్ని ప్రోత్సహిస్తుందని దుయ్యబట్టారు. ఒక్క లైసెన్స్‌పై వంద షాపులు సిండికెట్లు దక్కించుకున్నాయని, పాఠశాలలు ఆలయాల వద్ద మద్యం షాపులు ఎక్కువైపోతున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో బెల్టు షాపులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, గ్రామాల్లో మద్యం నిషేధించాలని ప్రజలు కోరుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మద్యం సిండికెట్లతో ప్రభుత్వం కుమ్మక్కైందని బాబు విమర్శించారు. మద్యం సిండికేట్లను బొత్స తేలికగా తీసిపారేయడం విడ్డూరంగా ఉందన్నారు. సర్కార్ విధి విధానాల వల్ల సమాజం భ్రష్టు పట్టిపోయిందని చెప్పారు. దాడులు జరిగినా బెల్టు షాపులు మూత పడట్లేదని, ఎమ్మార్పీ రేటుకే మద్యం విక్రయించాలని చంద్రబాబు అన్నారు. మద్యం సిండికేట్లతో మంత్రులు, ఎమ్మెల్యేల పాత్ర ఉందని ఏసీబీ తేల్చినట్టు తమ వద్ద సమాచారం ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్సయిజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పని చేసే పరిస్థితి లేదన్నారు. మద్యం సిండికేట్లకు బాధ్యులైన వారి పేర్లు బహిర్గతం చేయాలని బాబు డిమాండ్ చేశారు.