ఢిల్లీలో మీటింగ్.. రాష్ట్రంలో ఫైటింగ్! సెప్టెంబర్ 17 సభకు అమిత్ షా..
posted on Sep 7, 2021 @ 4:16PM
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 17న రాష్ట్రానికి రానున్నారు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్ లో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అమిత్ షా పర్యటనకు ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటన విడుదలైంది.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ. విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. నిర్మల్ వెయ్యి ఊడల మర్రి వద్ద సభకు ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని మర్రి చెట్టు వద్ద ఊచకోత కోసిన రజాకార్లు. కాలక్రమంలో వెయ్యి ఊడల మర్రిగా ఆ చెట్టు ప్రసిద్ధి చెందింది. అమిత్ షా పర్యటనతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయత్రకు బ్రేక్ పడబోతోంది. సంజయ్ పాదయాత్ర ఇప్పటికే 100 కిలోమీటర్లు దాటింది. ఈ నెల 17వ తేదీ నాటికి ఆయన పాదయాత్ర కామారెడ్డికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో పాదయాత్రకు ఆయన బ్రేక్ ఇవ్వనున్నారు. అనంతరం నిర్మల్ లో జరిగే తెలంగాణ విమోచన సభకు వెళ్లనున్నారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.కొన్ని రోజులుగా దూకుడుగా వెళుతోంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ్ యాత్రలో కేడర్ లో మరింత జోష్ వచ్చింది. ఇంతలోనే ఢిల్లీకి వెళ్లిన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. దీంతో బీజేపీ టార్గెట్ గా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మోడీతో కేసీఆర్ మిలాఖత్ అయ్యారని, తెలంగాణ బీజేపీ నేతలంతా జీరోలని కామెంట్ చేస్తున్నారు. బండి సంజయ్ పాదయాత్ర ఆపి ఇంట్లో కూర్చుంటే బెటరని జగ్గారెడ్డి లాంటి నేతలు సెటైర్లు వేస్తున్నారు.
కేసీఆర్ ఢిల్లీ సమావేశాలతో తెలంగాణ బీజేపీలో నిస్తేజం అలుముకుందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమిత్ షా టూర్ ఖరారు కావడంతో తెలంగాణ బీజేపీ నేతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అమిత్ షా పర్యటనతో కేసీఆర్ తో తమకు ఎలాంటి డీల్స్ లేవని స్పష్టం చేసినట్లు అవుతుందని అంటున్నారు. బహిరంగ సభలోనూ కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారని చెబుతున్నారు.