చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో దొంగలు పడ్డారు
posted on Mar 23, 2015 7:43AM
చెన్నై-సికింద్రాబాద్ చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలులో దొంగలు పడ్డారు. శనివారం అర్ధరాత్రి ప్రయాణికులు గాడనిద్రలో ఉన్న సమయంలో ప్రకాశం జిల్లా రాపర్ల-ఉప్పుగుండూరు మధ్య చైన్ లాగి రైలును ఆపివేసి దాదాపు పది మంది దొంగలు ఎస్-10, 12, 13, 14 బోగీలలోని మహిళల మెడలో గొలుసులను దోచుకొని పోయారు. ప్రయాణికులు తెరుకోనేలోగా క్షణాల వ్యవధిలోనే దొంగలు నగలు దోచుకొని పారిపోయారు. గమ్మత్తయిన విషయం ఏమిటంటే అదే రైలులో ఒంగోలు రైల్వే ఎస్సై భావనారాయణ జనరల్ బోగీల్లో ఉన్నారు. ఇటీవల కాలంలో రైళ్ళలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండటంతో ప్రయాణికుల భద్రత కోసం కొంత మంది రైల్వే పోలీసులతో ఆయన డ్యూటీలో ఉన్నారు. కానీ దొంగలు చైన్ లాగి రైలుని నిలిపివేసి పక్కబోగీలలో దోపిడీ చేస్తున్నా అప్రమత్తమవకపోవడం విశేషం.
రైలు సికింద్రాబాద్ చేరుకొన్న తరువాత ప్రయాణికులు స్టేషన్ లో రైల్వే సీఐకి ఫిర్యాదు చేశారు. ఈవిషయం గురించి ఆయన ఉన్నతాధికారులకి తెలియజేయడంతో వారు ఒంగోలు రైల్వే ఎస్సై భావనారాయణను వెంటనే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసారు. రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే రైళ్ళలో ఇటువంటి దోపిడీలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. వాటిని అరికట్టేందుకు రైళ్ళలో పోలీసులు గస్తీ కూడా తిరుగుతున్నారు. కానీ ప్రయాణికులకి భద్రత కల్పించలేకపోతున్నారు. ఇక వారు దొంగలను పట్టుకోవడం, వారు దోచుకొన్న నగలు,డబ్బును స్వాధీనం చేసుకొని ప్రయాణికులకి తిరిగి అప్పజెప్పగలరని అనుకొంటే అది అత్యాశే అవుతుంది.