అమరావతి మట్టికి చంద్రబాబు ప్రణామం!
posted on Jun 20, 2024 @ 3:54PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటించారు. మొదట ప్రజావేదికను కూలగొట్టిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ప్రధాని మోడీ అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్ళారు. ఈ సందర్భంగా అక్కడ మట్టికి చంద్రబాబు ప్రణామం చేశారు. అనంతరం జగన్ ప్రభుత్వ పాలనలో అమరావతిలో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలను చంద్రబాబు పరిశీలించారు.
అనంతరం సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేశారు. ఈ సంఖ్యని కలిపితే వౌైసీపీకి వచ్చిన సీట్లతో సరిపోలుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని పూర్తవుతుందనే నమ్మకంతో రైతులు పోరాటాన్ని విరమించారు. రైతులందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు. ఏపీ అంటే అమరావతి, పోలవరం. ఎవరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళకుండా ఉండాలనే ఇక్కడ రాజధాని నిర్మాణాన్ని చేపట్టాం. పోలవరాన్ని సందర్శించి వచ్చిన తర్వాత చాలా బాధ కలిగింది. ప్రజావేదికను కూల్చి జగన్ పరిపాలనను ప్రారంభించారు. పవిత్ర జలాలు, మట్టి తీసుకొచ్చి ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం కాబట్టి ఆ మట్టే మనల్ని కాపాడింది. పవిత్ర మట్టిని చూసిన తర్వాత అదే అనిపించింది. కొన్ని అల్లరి మూకలు ఇక్కడ ఏర్పాటు చేసిన నమూనాలను ధ్వంసం చేశాయి. అమరావతి రైతులు వాటిని కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేశారు. ఇక్కడ పైపులు, మట్టిని దొంగతనం చేస్తున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఐకానిక్ కట్టడాలన్నీ నిలిచిపోయాయి. ఇక అమరావతికి మంచిరోజులు వచ్చాయి. తెలుగుజాతి గర్వంగా తలెత్తుకునే రాజధాని నగరం ఇక్కడ రూపొందుతుంది’’ అన్నారు.