చంద్రబాబు, స్టాలిన్ భేటీ.. బీజేపీకి బీపీ!
posted on Jun 6, 2024 @ 11:24AM
మొన్నటి వరకు భారత రాజకీయాలలో ఒకే హీరో వుండేవాడు. ఆ హీరో నరేంద్ర మోడీ. ఇప్పుడు ఇద్దరు హీరోలున్నారు. వారిలో నరేంద్ర మోడీ మాత్రం లేరు. వారిలో ఒకరు చంద్రబాబు నాయుడు, మరొకరు నితీష్ కుమార్. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడాలంటే వీరిద్దరి సహకారం తప్పనిసరి, వీరు ఇద్దరు చేజారిపోయినా, ఒక్కరు చేజారినా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం డౌటే. ఇలాంటి సందర్భంలో వీళ్ళిద్దరూ హీరో వర్షిప్ ఆస్వాదిస్తున్నారు. నిన్న ఢిల్లీలో ఎన్డీయే పక్షాల సమావేశం జరిగినప్పుడు.. చంద్రబాబు, నితీష్ మోడీకి భరోసా ఇచ్చారు. చక్కగా మూడోసారి ప్రధాని పీఠం మీద కూర్చోండి సార్ అని ఆశీర్వదించారు. దాంతో మోడీ ఈనెల 9న మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బీజేపీ నాయకత్వం కూడా చాలా హ్యాపీగా ఫీలైంది. ఇంతవరకు బాగానే వుందిగానీ, ఎన్డీయే సమావేశం తర్వాత చంద్రబాబు, నితీష్ కుమార్ తిరుగు ప్రయాణంలో వున్నప్పుడు జరిగిన సంఘటనలు బీజేపీలో వణుకు పుట్టించాయి.
చంద్రబాబు నాయుడు విజయవాడ వెళ్ళడం కోసం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న సమయానికి అక్కడ అప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వున్నారు. దాంతో ఎయిర్‌పోర్టులోనే చంద్రబాబు, స్టాలిన్ భేటీ అయ్యారు. ఇద్దరు కొంతసేపు దేశంలో, ఇద్దరి రాష్ట్రాల్లో వున్న రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. చంద్రబాబు ఎన్డీయేలో బలమైన నేతగా వుండగా, స్టాలిన్ ఇండియా కూటమిలో బలమైన నేతగా వున్నారు.
అదేవిధంగా, మరోవైపు నితీష్ కుమార్ కూడా ఎన్డీయే మీటింగ్ ముగిసిన తర్వాత తన రాష్ట్రానికి వెళ్ళడం కోసం విమానం ఎక్కారు. ఆ విమానంలో నితీష్ కుమార్ వెనుకే ఇండియా కూటమిలో భాగస్వామి అయిన తేజస్వి యాదవ్ వున్నారు. మరి.. ఒకే విమానంలో ప్రయాణించినప్పుడు ఇద్దరి మధ్య సంభాషణ జరగడం సహజమే కదా. పాట్నాలో విమానం దిగిపోయాక వీళ్ళిద్దరు కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
చంద్రబాబు, స్టాలిన్... అలాగే నితీష్, తేజస్వి యాదవ్ భేటీ అవడం కాకతాళీయమే అయినా, ఈ రెండు సంఘటనలు బీజేపీ నాయకత్వంలో వణుకు పుట్టించాయి. ఈ ఇద్దరు కీలక నేతలను తనవైపు లాక్కోవడం ద్వారా ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తోందా అనే సందేహాలు బీజేపీ వర్గాల్లో ఏర్పడ్డాయి. అయితే.. చంద్రబాబు, నితీష్ ఎన్డీయే సమావేశంలో బేషరతుగా మద్దతు ప్రకటించారు కాబట్టి, బీజేపీ నాయకత్వం వణుకు కొంచెం తగ్గింది. అయితే బీజేపీ నాయకుల మనసులో ఏదో ఒక మూలలో భయమైతే వుంది.