విపక్ష పాత్రకే జనసేనాని మొగ్గు?!
posted on Jun 6, 2024 @ 11:19AM
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి తిరుగులేని విజయం సాధించింది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దగ్గని ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్ధానాలలోనూ విజయం సాధించింది. ఇక ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కేబినెట్ కూర్పుపై దృష్టి సారించారు. జాతీయ స్థాయిలో ఎన్డీయేలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిన తెలుగుదేశంకు కేంద్ర కేబినెట్ లో ఐదారు మంత్రిపదవులు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. అది కూడా కీలక మంత్రిత్వ శాఖలనే కోరాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్ర కేబినెట్ విషయం పక్కన పెడితే ఏపీలో చంద్రబాబు కేబినెట్ కూర్పు ఎలా ఉండబోతోందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. బాబు కేబినెట్ లో రెండు బెర్త్ లు బీజేపీకి దక్కే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే.. తొలి నుంచీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, చీల నివ్వను అంటూ చెప్పి.. దానిని దాదాపుగా సాధించిన పవన్ కల్యాణ్ కు చంద్రబాబు కేబినెట్ లో కీలక పదవి ఖాయమన్న భావన వ్యక్తం అవుతోంది. కీలక మంత్రి పదవితో పాటు ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
అయితే జనసేనాని మాత్రం రాష్ట్ర కేబినెట్ లో జనసేన చేరకుండా విపక్ష పాత్ర పోషిస్తే బాగుంటుందన్న భావనలో ఉన్నట్లు ఆయనకు సన్నిహితంగా ఉండే వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంలో భాగమై ఉండటం కంటే.. ఫ్రెండ్లీ అప్పోజిషన్ ద్వారా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకునేలా అసెంబ్లీలో గళం విప్పడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నట్లు చెబుతున్నారు. జనసేనాని తాను ఎమ్మెల్యేగా మాత్రమే పూర్తి జీతం తీసుకుంటానని చెప్పడాన్ని ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు.
జనసేన ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తే ప్రభుత్వ లోపాలను ప్రశ్నించడం ద్వారా ప్రజలకు చేరువై రాష్ట్రంలో జనసేనను బలోపేతం చేసి, సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నది పవన్ కల్యాణ్ ఉద్దేశంగా చెబుతున్నారు.
అలా కాకుండా కేబినెట్ లో చేరితే ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపేందుకు అవకాశం ఉంటుందన్నది ఆయన భావనగా చెబుతున్నారు. అలాగే ఇది మన ప్రభుత్వం.. అసాధారణ మెజారిటీ కారణంగా కొన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏ మాత్రం లేకుండా ఫ్రెండ్లీ ప్రతిపక్ష పాత్ర పోషించాలనీ, ఎన్నికల సందర్భంగా స్వయంగా తాను ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకునే అవకాశం ఉంటుందనీ జనసేనాని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా రాష్ట్రంలో బలోపేతం కావడంతో పాటు.. వైసీపీకి రాష్ట్రంలో అవకాశం లేకుండా చేయ వచ్చని జనసేనాని భావిస్తున్నట్లు సమాచారం.