అప్పు తెచ్చు కుంటాం అనుమతివ్వండి.. కేంద్రానికి ఏపీ విజ్ఞప్తి
posted on Dec 12, 2021 @ 1:40PM
నిజమే, రాష్ట్ర విభజన వలన అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిన మాట వాస్తవం. రాజ్య సభలో వైసీపే ఎంపీ, విజయసాయిరెడ్డి అన్నట్లుగా అశాస్త్రీయంగా జరిగిన విభజన వలన ఏపీకి చాలా పెద్ద అన్యాయమే జరిగింది. అందులో మరో అభిప్రాయానికి ఆస్కారమే లేదు. అయితే, ఆంధ్ర రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కుంటున్న, ఆర్థిక దుస్థితి అదొక్కటే కారణం కాదు. ఇంకా చాలా కారణాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన, చేస్తున్నఅన్యాయం మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం స్వయంకృతం చిట్టా కూడా చాలానే వుంది.
ప్రస్తుత పరిస్థితికి రాష్ట్ర విభజన వలన జరిగిన అన్యాయం కంటే, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం, అనుసరిస్తున్న ఆర్థిక విధనాలు,ఆర్థిక క్రమ శిక్షణా రాహిత్యం,ఓటు బ్యాంకు రాజకీయ ఎత్తుగడలు, అవినీతి, అసమర్ధత పాలనే ప్రధాన కారణంగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు, రాష్ట్ర విభజనలోనే కాదు,రాష్ట్ర విభజన అనంతరం కూడా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే ఉంది. ప్రత్యేక హోదాను ముగిసిన అధ్యాయం అంటూ అవతల పెట్టింది.హోదాకు బదులుగా ఇస్తామన్న ప్యాకేజి ఏమైందో ఎవరికీ తెలియదు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం ఆర్థిక సహాయం చేసేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి ఎప్పీ ప్రభుత్వం ముఖాన తలుపులు వేసింది, రైల్వే జోన్ పట్టాలు తప్పింది, ఎటు పోతుందో, ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అయినా ముఖ్యమంత్రి ముఖంలో నవ్వు చెదరలేదు. ఇదేమిటని అడిగేందుకు నోటు పెగలడం లేదు ఒకటని కాదు, విభజన చట్టంలో హామీల అమలుకు సంబంధించి పట్టించుకున్న పాపాన పోలేదు. అయినా, కేంద్రాన్ని ప్రశ్నించే, కేంద్రంపై పోరారం చేసే సాహసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయడం లేదు. కారణం ఏమిటో కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ముఖ్యమంత్రి మెడ చుట్టూ వేళ్ళాడుతున్న అక్రమాస్తుల ‘మెడల్స్’ గొంతుకు అడ్డం పడుతున్నాయి. నోరు పెగలకుండా చేస్తున్నాయి.అందుకే, ఇంకేమీ వద్దు అదనపు అప్పుచేసుకునే వెసులు బాఆటు కలిపిస్తే చాలని, జగనన్న పభుత్వం కేంద్ర ప్రభుత్వాన్నివేడుకుంటోంది.
ఏపీ ప్రభుత్వం వరుసగా చేస్తున్న అప్పులపై ఇప్పటికే ఆర్బీఐతో పాటు వివిధ ఆర్ధికసంస్ధలు సైతం పెదవివిరుస్తున్న నేపథ్యంలో వైసీపీ సిగ్గు విడిచి, పార్లమెంట్ సాక్షిగా అప్పు అనుమతి కోసం కేద్రాన్ని వేడుకుంటోంది. కొద్ది రోజుల క్రితం, లోక్ సభలో వైసీపీ సభ్యులొకరు రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని, ‘ఆదుకోండి ప్లీజ్’ అంటూ కేంద్రానికి అర్జీ పెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా (శుక్రవారం) రాజ్య సభలో వైసీపీ సభ్యుడు, విజయసాయి రెడ్డి స్థూల ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ) లో అదనంగా 0.5 శాతం రుణాల సేకరణకు అనుమతించాలని కేంద్రాన్ని కోరారు. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలోకి ప్రవేశిస్తున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుని అదనంగా రుణ సేకరణకు రాష్ట్రాన్ని అనుమతించాలని విజయ సాయిరెడ్డి ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా అమలు చేయడానికి దోహదం చేసినట్లవుతుందని అన్నారు. ఇప్పటికే ఏపీ అప్పులపై కేంద్ర ఆర్ధికశాఖ నుంచి సైతం అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అదనపు రుణానికి అనుమతి లభిస్తుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది.
అదలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. అప్పుల మీద సాగే ప్రభుత్వం ఎంతకాలం సాగుతుంది? చివరకు ఏమి జరుగుతుంది? అంటే వైసీపీ ఆభిమానులు కూడా,,. ఇంతవరకు ఎక్కాడ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే ప్రమాదం లేక పోలేదని, అదేజరిగితే ఇప్పటికే, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విముఖత వ్యక్త పరుస్తున్న పెట్టుబడి దారులు ఇక ఎపీముఖమే చూడరని అంటున్నారు ..