కేసీఆర్ యాదాద్రికి ఆ రోజే ఎందుకు వెళుతున్నారు?
posted on Sep 14, 2021 @ 6:31PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 17న యాదాద్రికి వెళుతున్నారు. ఆలయ పునర్ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. నిజానికి కేసీఆర్ యాదాద్రి పర్యటన మొదట మంగళవారమే ఖరారైంది. సీఎంవో నుంచి షెడ్యూల్ కూడా వచ్చింది. తర్వాత సీఎం కార్యక్రమం రద్దైందనే సమాచారం వచ్చింది. ఈనెల 14న కాదు 17న కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తారనే ప్రకటన ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి యాదాద్రి పర్యటనలో మార్పుపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. రాజకీయ కోణంలో ఆయన యాదాద్రిలో పర్యటనలో మార్పు చోటు చోసుకుందనే ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్ గా సాగుతున్నాయి. ప్రధాన పార్టీల పోటాపోటీ ఎత్తులతో జనంలోకి వెళుతున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ్ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తుండగా.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దళిత గిరిజన దండోరా పేరుతో గర్జిస్తున్నారు. విపక్షాలకు కౌంటర్ గా అధికార పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 17 ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. తెలంగాణ విమోచన దినోత్సవం రోజునే ప్రతి పక్షాలు భారీ సభలు నిర్వహిస్తున్నాయి. బీజేపీ ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రిని రప్పిస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు అమిత్ షా. ఈ సభను బీజేపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని జిల్లాల నుంచి జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్ షా సభ ద్వారా కేసీఆర్ సర్కార్ పై సమరశంఖం పూరించబోతున్నామని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఇక కాంగ్రెస్ కూడా సెప్టెంబర్ 17నే దళిత గిరిజన దండోరా సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ వేదికగానే గర్జించేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. గజ్వేల్ సభను కాంగ్రెస్ కూడా సవాల్ గా తీసుకుంది. జన సమీకరణ కోసం నియోజకవర్గాల వారీగా ఇంచార్జులను నియమించింది. కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ఈ సభ ద్వారా సత్తా చాటాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి. అదే సమయంలో నిర్మల్ లో బీజేపీ నిర్వహిస్తున్న సభకు ధీటుగా జనసమీకరణకు ప్లాన్ చేస్తున్నారు. గజ్వేల్ సభ ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా కేసీఆర్ కు షాక్ ఇవ్వడంతో పాటు బీజేపీ సభను కార్నర్ చేయవచ్చని భావిస్తోంది రేవంత్ రెడ్డి టీమ్.
విపక్షాల వ్యూహాలకు కౌంటర్ గా సీఎం కేసీఆర్ ప్లాన్ మార్చారని అంటున్నారు. అందుకే 14న ఉన్న యాదాద్రి పర్యటనకు 17వ తేదీకి మార్చారని అంటున్నారు. కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తే.. మీడియా అటెన్షన్ అంతా అటువైపు ఉంటుందనే యోచనలో గులాబీ నేతలు ఉన్నారట. దీంతో విపక్షాల సభలకు మీడియా మైలేజీకి గండి పెట్టవచ్చనే వ్యూహంలో భాగంగానే కేసీఆర్ తన యాదాద్రి పర్యటనను 17వ తేదీకి మార్చుకున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ 17నే నిర్మల్ లో బీజేపీ బహిరంగ సభ , గజ్వేల్ లో రేవంత్ రెడ్డి దళిత గిరిజన దండోరా సభలు ఉండగా.. అందుకు పోటీగా సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన ఉందంటున్నారు.
అంతేకాదు యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు కేసీఆర్. యాదాద్రి పర్యటనలో ప్రధాని రాక వివరాలను ప్రకటించే అవకాశం ఉందట.అమిత్ షా సభ రోజే ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన వివరాలను ప్రకటించి బీజేపీని డిఫెన్స్ లో పడేసే యోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. ఇలా రాజకీయ పార్టీల పోటాపోటీ వ్యూహాలతో తెలంగాణ రాజకీయాల్లో గతంలో ఎప్పుడు లేనంత వేడి రాజుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.