ప్రధానికి జగన్ మరో లెటర్.. పొలిటికల్ డ్రామా ఆపాలన్న పవన్
posted on Jul 7, 2021 @ 9:40PM
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను పట్టించుకోకుండా శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్, పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి తెలంగాణ విద్యుత్ సంస్థలు. దీంతో పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి చేరుతున్న కృష్ణా జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. నీళ్లన్ని వృధాగా పోతున్నా ప్రభుత్వాల తీరు మారకపోవడంపై ఆయకట్టు రైతుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జనాల కోసం కాకుండా రాజకీయ మైలేజీ కోసమే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గేమ్ ఆడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. విపక్షాలన్ని ఇవే ఆరోపణలు చేస్తున్నాయి.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ జలవివాదం నమ్మశక్యంగా లేదని అన్నారు. తాము చాలా సఖ్యంగా ఉన్నామని ఇద్దరు సీఎంలు కేసీఆర్, జగన్ ప్రకటించారని... అలాంటప్పుడు వివాదాలు ఎందుకు వస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. పరిస్థితి చూస్తుంటే అ వివాదం రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ డ్రామాగా ఉందని అన్నారు. ఇప్పటికైనా డ్రామాను ఆపి.. చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు పవన్ కళ్యాణ్.
ఇక కేసీఆర్‌తో ప్రగతిభవన్‌లో బిర్యానీ మీటింగ్‌లు పెట్టిన జగన్.. నీటి వివాదాలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. నువ్వు కొట్టినట్టు ఉండాలి.. నేను ఏడ్చినట్టు ఉండాలనే నాటకాలు ఎన్నాళ్లు ఆడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని, కేంద్రమంత్రులకు రాసిన లేఖలో విభజన చట్టంలోని అంశాలు ఎందుకు ప్రస్తావించలేదు? అని ఆయన ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రధానిని ఎందుకు కోరలేదని అన్నారు. కృష్ణా నీటి వివాదాలపై సాక్షి గుమాస్తా సజ్జల మాట్లాడమేంటి? అని ప్రశ్నించారు. అంతరాష్ట్ర జల వివాదాలంటే ఐపీఎల్ బెట్టింగులో తాడేపల్లిలో కూర్చొని పబ్జీ ఆడటం కాదని తెలుసుకోండని ఉమ విమర్శించారు.
మరోవైపు ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ మరో లేఖ రాశారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని ఆ లేఖలో ఆరోపించారు. జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కేఆర్ఎంబీ పరిధిని తక్షణమే నోటిఫై చేసేలా జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టుల వద్ద రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేందుకు సీఐఎస్ఎఫ్ బలగాల పరిధిలోకి ప్రాజెక్టును తీసుకురావాలని జగన్ విన్నవించారు. విభజన చట్టాన్ని, అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలను, కేఆర్ఎంబీ ఆదేశాలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని చెప్పారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పెరగకుండా తెలంగాణ ఎప్పటికప్పుడు నీటిని వాడేస్తోందని అన్నారు. దీనివల్ల పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు సాగునీరు రాకుండా పోతోందని చెప్పారు.కేఆర్ఎంబీకి సమాచారం ఇవ్వకుండానే నాగార్జున సాగర్, పులిచింతల, శ్రీశైలం ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తోందని జగన్ ఆరోపించారు.