వైసీపీపై రెచ్చిపోయిన పాల్ ..టచ్ చేస్తారా? దమ్ముందా?
posted on Nov 26, 2022 @ 3:44PM
తెలుగు రాష్ట్రాలలో రాజకీయ జోకర్ గా కేఏ పాల్ కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన మాటలు, చేష్టలకు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రీజ్ ఉంది. ప్రజాశాంతి పార్టీ అధినేతగా ఆయన ఎన్నికల బరిలో దిగుతారు. ప్రజాదరణ, ఎవరు ఓటేస్తారు? ఎన్ని ఓట్లు వస్తాయన్న అంచనాలతో సంబంధం లేకుండా కోటలు దాటేలా ప్రసంగాలు చేస్తూ తన విజయం ఖాయమని ప్రకటించేస్తారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికనే తీసుకుంటే.. ప్రజలలో కలిసి ఆయన చేసిన డ్యాన్సులు, పోలీంగ్ బూతుల వద్ద పెట్టిన పరుగులు విపరీతంగా వైరల్ అయ్యాయి. అటువంటి పాల్ తాజాగా ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్, ఆయన కేబినెట్ లోని మంత్రులను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నానిపై కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను, శ్రేణులను విస్మయానికి గురి చేస్తున్నాయి. కేఏ పాల్ ఏంటీ.. ఇలా మాట్లాడడం ఏమిటని నివ్వెరపోతున్నాయి.
అంతేకాదు.. కేఏ పాల్ వీడియో.. రిపీటెడ్ గా చూస్తుండటంతో ఆ వీడియోకు వ్యూస్ కూడా భారీగా పెరిగాయి. అలాంటి వేళ.. ఫ్యాన్ పార్టీలో నోరున్న నేతలంతా ప్రెస్ మీట్ పెట్టి.. కేఏ పాల్‌పై మాటల దాడికి దిగుతారా? అన్న చర్చ అయితే వైసీపీ నేతల్లో మొదలైంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆయనపై దోమ కాదు కదా ఈగ కూడా వాలనివ్వకుండా.. తొలి కేబినెట్‌లోని మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు ఎక్సెట్రా ఎక్సె ట్రా వంటి వారు చాలా జాగ్రత్తగా చూసుకున్నారని .. అలాంటి వారంతా ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగి ప్రెస్‌మీట్ పెట్టి.. తమ మాటల తూటాలు పేలుస్తారా? లేక సైలెన్స్ మెయిన్టైన్ చేస్తారా? అని వైసీపీ శ్రేణులు ఆసక్తిగా, ఆతృతగా చూస్తున్నారు. కానీ మాజీలైన ఆ మంత్రులందరూ పదవి కోల్పోయిన తరువాత మీడియా ముఖం చాటేస్తున్న సంగతిని గుర్తు చేసుకుని నిరుత్సాహపడుతున్నారు.
ఇక మంత్రి ఆర్కే రోజా, అంబటి రాంబాబు వంటి వారే అయినా స్పందిస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఓ వేళ స్పందించినా.. రోజా మాత్రం తనదైన శైలిలో పంచ్ డైలాగులు గుప్పిస్తారని అంటున్నారు. అయితే తాజా వీడియోలో సీఎం జగన్‌పై కేఏ పాల్ మాట్లాడినట్లు.. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, లేదా జనసేనాని పవన్ కల్యాణ్ మాట్లాడి ఉంటే.. వీరంతా ఇప్పటికే విమర్శలతో, పరుష పదజాలంతో రెచ్చిపోయేవారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.
తాజా వీడియోలో.. కేఏ పాల్.. సీఎం జగన్, మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నానిలపై చేసేన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు గత మూడున్నరేళ్లలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ సైతం చేయలేదని నెటిజన్లు భలే ఎంజాయ్ చేస్తున్నారు.
జగన్ పార్టీ లో నోరేసుకు పడిపోయే నేతలనే తలదన్నేలా కేఏ పాల్ తాజా వీడియోలో చెలరేగిపోయారని నెటిజన్లు అంటున్నారు. ఇప్పుడు కేఏ పాల్‌కు ఎవరు.. ఏ స్థాయిలో కౌంటర్ ఇస్తారో వేచి చూడాలని కామెంట్లు చేస్తున్నారు.