కేసీఆర్ అవినీతిపై అమిత్‌షా ఆదేశాలు.. గులాబీబాస్‌కు గండమేనా?
posted on Dec 21, 2021 @ 3:37PM
కేసీఆర్ వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నాడు.. ఆ లెక్కలన్నీ మా దగ్గర ఉన్నాయి.. ఆ ఆధారాలన్నీ సేకరించాం.. త్వరలోనే కేసీఆర్ జైలుకు వెళ్లక తప్పదు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పదే పదే చేస్తున్న హెచ్చరిక ఇది. బియ్యం కుంభకోణం వెనుక పెద్ద దందానే ఉంది.. ఆ గుట్టు అంతా బయటకు లాగుతాం.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇస్తున్న వార్నింగ్ ఇది. కొంతకాలంగా తెలంగాణ బీజేపీ నేతల నుంచి తరుచూ వినిపిస్తున్న మాటలివి. తాజాగా, కేంద్ర హోంమంత్రి, బీజేపీ బడా నేత అమిత్‌షా సైతం పార్టీ కేడర్‌కు ఇదే ఆదేశాలు ఇచ్చారు. "కేసీఆర్ అవినీతిని ప్రజలకు వివరంగా చెప్పండి.. టీఆర్ఎస్ నేతల బియ్యం కుంభకోణం, ఇతర అవినీతిని వెలికితీయండి.. ముఖ్యమంత్రి అవినీతిపై విచారణకు డిమాండ్ చేయండి.." అంటూ అమిత్‌షా అంతటివారే రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయడం సంచలనంగా మారింది.
కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్‌షా.. పక్కా ఆధారాలతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. అంటే.. కేసీఆర్‌పై వస్తున్న వేల కోట్ల అవినీతి ఆరోపణలు నిజమేనా? బీజేపీ నేతల దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయా? త్వరలోనే కేసీఆర్‌పై సీబీఐ, ఈడీ కేసులు తప్పవా? కమలనాథులు అంటున్నట్టు.. కేసీఆర్ జైలుకు వెళ్లాల్సిందేనా? అంటూ అప్పుడే చర్చ మొదలైపోయింది.
తాజాగా, పార్లమెంట్‌లోని అమిత్‌షా ఛాంబర్‌లో తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో కీలక సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎంపీ అర్వింద్, మాజీ ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి తదితర బడా నేతలు భేటీ అయ్యారు. ఈ మీటింగ్‌కు కేంద్రమంత్రి పీయూష్ గయల్ కూడా వచ్చారు. అంతా హేమాహేమీలే. అందులోనూ అమిత్‌షాతో స్పెషల్ మీటింగ్. అంటే, కీలక పరిణామాలకి వ్యూహరచన కోసమే అంటున్నారు. పైకి వరి కొనుగోలు అంశం, టీఆర్ఎస్‌కు కౌంటర్లపై చర్చ జరిగినా.. కేసీఆర్ అవినీతి, బియ్యం కొనుగోళ్ల కుంభకోణంపై కీలక మంతనాలు జరిగాయని తెలుస్తోంది. పలువురు టీఆర్ఎస్ నేతలు కర్నాటక నుంచి తక్కువ ధరకు బియ్యం తీసుకొచ్చి.. తెలంగాణ కోటాలో ఎఫ్‌సీఐకి అధిక ధరకు అమ్ముతున్నారని.. ఈ బియ్యం దందా కేటీఆర్ కనుసన్నల్లో జరుగుతోందని బీజేపీ పెద్దలకు ఎంపీ అర్వింద్ వివరించినట్టు తెలుస్తోంది.
ఆ మీటింగ్ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో అమిత్‌షా ప్రత్యేకంగా పావు గంట పాటు సమాలోచనలు జరిపారు. ఆ ఇంటర్నల్ మీటింగ్‌లో కేసీఆర్ కుటుంబం కరెప్షన్ గురించి బండి సంజయ్.. అమిత్‌షాకు వివరించారని సమాచారం. ఇన్నాళ్లూ కేసీఆర్ ఫ్యామిలీ అవినీతిపై చూసీచూడనట్టు ఉండగా.. ఇటీవల ప్రభుత్వం తరఫు నుంచి బీజేపీపై, కేంద్రంపై దాడి పెరగడంతో.. ఇక ఉపేక్షించాల్సిన అవసరం లేదని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ నేతల బియ్యం దందాపై ఎంపీ అర్వింద్ ఆధారాలు రెడీ చేశారు. కల్వకుంట్ల కుటుంబం కరెప్షన్‌పై బండి సంజయ్ దృష్టి సారించారు. పక్కా ఎవిడెన్స్‌తో కేసీఆర్‌పై కేసుల ఉచ్చు బిగించేలా.. ఢిల్లీ స్థాయిలో కమలనాథులు గ్రౌండ్‌వర్క్ ప్రిపేర్ చేస్తున్నారని అంటున్నారు. తాజా, అమిత్‌షా మీటింగ్‌తో ఆ మేరకు రాష్ట్ర బీజేపీ నాయకులకు పక్కా ఆదేశాలు వచ్చాయని.. త్వరలోనే కేసీఆర్‌కు వ్యతిరేకంగా కీలక పరిణామాలు జరగనున్నాయని ఢిల్లీ వర్గాల సమాచారం. అయితే, బీజేపీ నేతలు నిజంగానే కేసీఆర్‌కు ఉచ్చు బిగిస్తారా? లేక, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పదే పదే డిమాండ్ చేస్తున్నట్టు.. ఆ ఆధారాలు బయటపెట్టి.. ముఖ్యమంత్రిపై కేసులు పెట్టి.. కేసీఆర్‌ను జైల్లో పెడతారా? లేదంటే.. స్వయంగా కేసీఆరే సవాల్ చేసినట్టు ఆయనపై సీబీఐ, ఈడీ దాడులు చేసే సాహసం కేంద్రం చేస్తుందా? పరిస్థితులు చూస్తుంటే ముందుముందు తెలంగాణ రాజకీయం అగ్నిగోళంగా మండేట్టు ఉందంటున్నారు విశ్లేషకులు.