రాజకీయ లబ్ధి కోసం వైసీపీ శవరాజకీయం!
posted on Dec 29, 2022 @ 4:28PM
అధికార వైసీపీలో హుందాతనం కనుమరుగైంది. విపక్ష సభలకు జనం పోటెత్తడం ఆ పార్టీకి కంటగింపుగా మారింది. జనం విపక్ష నేతకు బ్రహ్మరథం పడుతుంటే.. జీర్ణించుకోలేక కారాలూ, మిరియాలూ నూరుతోంది. జడ్ ప్లస్ క్యాటగరి భద్రత ఉన్న చంద్రబాబునాయుడి పర్యటనల్లో కనీస పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయకుండా.. ఆయన ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టడానికి వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలోనే కందుకూరు ఘటన విషయంలో భద్రతా ఏర్పాట్లలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నా ఎదురు విమర్శలతో రాజకీయ పబ్బం గడిపేసుకోవాలని ప్రయత్నిస్తున్నది. కుందుకూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహించిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇది వాస్తవం. ఎనిమిది నిండు ప్రాణాలు బలైపోయాయి. ఇదీ వాస్తవమే. మాటల కందని మహా విషాదమిది. ఈ ఘటనపై అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా స్పందించారు. చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తెలుగుదేశం మృతుల కుటుంబాల బాధ్యత తీసుకుంటామని ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి తొలుత . పది లక్షల సాయం ప్రకటించింది. ఆ తరువాత దానిని పదిహేను లక్షలకు పెంచింది. అలాగే మరో ఎనిమిది లక్షల రూపాయలు తమ వంతుగా ఆందజేస్తామని నాయకులు ప్రకటించారు. మొత్తం తెలుగుదేశం పార్టీ మృతుల కుటుంబాలకు 24లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. ఏపీ సర్కార్ కూడా మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అయితే ప్రకటించింది.. కానీ జరిగిన సంఘటన నుంచి రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాటను కూడా మొదలెట్టేసింది. తొలుత సమాజిక మాధ్యమంతో మొదలెట్టి.. అధికార వైసీపీ మంత్రులు, నాయకులు దుర్ఘటన నుంచి రాజకీయ లబ్ధి కోసం శవరాజకీయాలకు తెరలేపారు. కందుకూరులో తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యుడు అంటూ.. అధికార పార్టీ ప్రచారం ప్రారంభించింది. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడినప్పుడు తొక్కిసలాట వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిది. పెద్ద సభ లేదా రోడ్ షో జరుగుతున్నప్పుడు పోలీసులు బందోబస్తు విధుల్లో కనిపించాలి. చిన్న చిన్న కార్యక్రమాలలోనే పోలీసుల పెద్ద సంఖ్యలో మోహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో విపక్ష నేత, అందునా జడ్ ప్లస్ కేటగరి భద్రత ఉన్న చంద్రబాబునాయుడు పాల్గొంటున్న సభ కు మరింత జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే కందుకూరులో అటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. పోలీసుల సంఖ్య అతి స్వల్పంగా ఉంది. తొక్కిస లాట సమయంలో పోలీసులు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. తొక్కిసలాటకు ముందు చంద్రబాబు తన ప్రసంగంలో పదే పదే ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు. తోసుకోవద్దు, వాహనాలు ఎక్కిన వారంతా కిందకు దిగాలి అని విజ్ణప్తి చేశారు. అయితే ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన ప్రభుత్వం మాత్రం ఘోరంగా విఫలమైంది. పైపెచ్చు రాజకీయ నేతల సభలో దుర్ఘటన జరగడం ఇదే మొదటి సారి అన్నట్లుగా విమర్శలు గుప్పిస్తోంది. అయితే
ఇటీవల విజయవాడలో వైసీపీ నిర్వహించిన జయహో బీసీ సభలో భోజనల దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుని ఒకరు చనిపోయారు. కనీసం ఆ కుటుంబాన్ని సీఎం జగన్ పరామర్శించలేదు అస్వస్థతతో చనిపోయాడని ప్రచారం చేసి చేతులు దులిపేసుకుంది. అలాగే గోదావరి జిల్లాలో జరగిన సభలో ఓ వృద్ధురాలు చనిపోయింది. ఆమె కుటుంబానికి కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఇక జగన్ పాదయాత్రలో తొక్కిసలాటల గురించి చెప్పనే అక్కర్లేదు. జగన్ పాదయాత్ర తొలి రోజే తొక్కిసలాటలో ఒకరు చనిపోయారు. అయితే ఆ ఏ సందర్భంలోనూ అటువంటి విషాద సంఘటనలపై తెలుగుదేశం కానీ, మరే ఇతర పార్టీలు కానీ రాజకీయ విమర్శలు చేసిన దాఖలాలు లేవు. కానీ కందుకూరు దుర్ఘటనలో తప్పు ప్రభుత్వం వైపు ఉన్నా.. తెలుగుదేశం తప్పిదమని చెప్పడానికి బురద రాజకీయం ప్రారంభించేసింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే దుర్ఘటన జరగడానికి చంద్రబాబే బాధ్యుడన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈ దుర్ఘటన సాకుగా చూపి భవిష్యత్ లో చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వవద్దంటూ పోలీసులకు సూచనలు చేశారు. ఈ సంఘటనకు లింకు పెట్టేసి లోకేష్ పాదయాత్రను కూడా అడ్డుకోవాలన్న కుట్రలకు తెరలేపారు. అయితే వాస్తవంగా కందుకూరు దుర్ఘటన ప్రభుత్వ వైఫల్యమని పరిశీలకులు చెబుతున్నారు. కనీస బందోబస్తు కూడా లేకపోవడం, ఉన్న కొద్ది మంది పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం వల్లే తొక్కిసలాటలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారంటున్నారు. విపక్ష నేత సభ జరిగే ప్రదేశంలో బారికేడ్లు పెట్టి తొక్కిసలాటలు వంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన పోలీసులు.. రోడ్డుకు ఆనుకునే ఎలాంటి రక్షణ గోడ లేకుండా ఉన్న కాలువ వద్ద కనీసం బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడ మేమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రచారయావ వల్లే ఇరుకు రోడ్లలో సభలు నిర్వహిస్తూ జనం అశేషంగా వచ్చారని చెప్పుకుంటున్నారని వైసీపీ నేతలు చెబుతున్న మాటలు అసంబద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రచార యావ అంటే రైతులకు ఇచ్చే భూమి పట్టాలపై ఫొటో ముద్రించుకోవడాన్ని మించి ప్రచార యావ ఎక్కడైనా ఉంటుందా అని సామాన్యలే ప్రశ్నిస్తున్నారు. ఇక కందుకూరు సభకు వచ్చిన జనం కనిపిస్తూనే ఉన్నారు. వారిని తరలించడానికి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయలేదు. స్కూలు బస్సులను బలవంతంగా తీసుకోలేదు. వచ్చిన వారంతా స్వచ్ఛందంగా వచ్చిన వారే. విపక్ష నేత ప్రభుత్వ విధానాలను విమర్శించేందుకు ప్రజల ముందుకు రావడాన్ని ఎవరూ ప్రశ్నించజాలరు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత లేకుంటే ఆ సభలకు జనం రారు. విశాఖ సహా పలు చోట్ల బలవంతంగా సమీకరించినా జగన్ సభ నుంచి జనం వెళ్లిపోతున్న దృశ్యాలు ప్రసార మాధ్యమాల ద్వారా అందరూ చూశారు. సభ నుంచి వెళ్లిపోయే వారిని ఆపడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలూ కనిపించాయి. కందుకూరు సభకు వచ్చిన వారు అలా తరలించిన వారు కాదు. ఎక్కడైనా సభలూ సమావేశాలూ జరిగితే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిది, పోలీసులదీ..ఇక్కడే ప్రభుత్వం, పోలీసులూ విఫలమైంది. కందుకూరు దుర్ఘటన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే. జగన్ పర్యటనలకు పరదాలు కప్పేసే పోలీసులు.. జడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబు సభకు కనీసం బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేయలేదు. రక్షణ గోడ లేని కాలువ వద్ద కనీసం పోలీసులనైనా పెట్ట లేదు. ఆ కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులే చెబుతున్నారు. అయినా ఒక విషాదం జరిగినప్పుడు రాజకీయ విమర్శలను పక్కన పెట్టి సహాయ కార్యక్రమాలకు చేయి అందించడం కనీస ధర్మం. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ విషాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతుంటే అధికార వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా రాజకీయ లబ్ధి కోసం ఆరాట పడుతూ.. ప్రభుత్వ తప్పిదాన్ని విపక్షంపై రుద్దడానికి ప్రయత్నిస్తోంది.