కర్నూలు సమీపంలో ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది మృతి
posted on Oct 24, 2025 7:26AM
ఆంధ్రప్రదేశ్ లో శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారు జామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెడుతున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్న టేకూరు సమీపంలో మంటల్లో చిక్కుకుంది. ఈ బస్సు బైక్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్ బస్సు కిందకు వెళ్లిపోయి ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో కలిసి మొత్తం 41 మంది ఉన్నట్లు తెలు స్తోంది. కిటికీ అద్దాలు పగులగొట్టుకుని 21 మంది బయటపడ్డారని చెబుతున్నారు.
ఇప్పటి వరకూ 11 మృతదేహాలను వెలికి తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఏసీ బస్సు కావడం, సంఘటన జరిగిన సమయంలో ప్రయాణీకులు గాఢ నిద్రలో ఉండటంలో ప్రమాద తీవ్రత అధికమైందని తెలుస్తోంది. మృతులలో అత్యధికులు హైదరాబాద్ వాసులే అని తెలుస్తోంది.
కాగా కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్ నుంచే సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్న చంద్రబాబు.. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు.
మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కర్నూలు జిల్లా చినటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాద సంఘటనపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షేడు మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని జిల్లా బిజెపి నేతలను అదేశించిచారు.