Read more!

పార్టీలో బెలూన్ పేలితే... చెవుడే!

ఓ ఇరవై ఏళ్ల క్రితం పిల్లల సంగతి వేరు. వారి పుట్టినరోజులు చాలా సాదాసీదాగా సాగిపోయేవి. ఇంట్లో పిండివంటలు చేసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, బడిలో చాక్లెట్లు పంచిపెట్టడంతోనే అవి ముగిసిపోయేవి. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. పుట్టినరోజు వచ్చిందంటే పార్టీ తప్పనిసరి. ఆ పార్టీకి వన్నె తెచ్చేందుకు రంగురంగుల బెలూన్లూ సరేసరి! కానీ ఆ బెలూన్లతో జర జాగ్రత్తగా లేకపోతే చెవుడు తప్పదంటున్నారు.

 


కెనడాకు చెందిన కొంతమంది పరిశోధకులు పార్టీలో వాడే బెలూన్లు పేలినప్పుడు ఎంత చప్పుడు వస్తుందో చూడాలనుకున్నారు. ఇందుకోసం వారు అత్యాధునికమైన మైక్రోఫోన్లను ఉపయోగించి బెలూన్లు పేలిన చప్పుడుని రికార్డు చేశారు. ఊదుతూ ఉండగా బెలూను పేలినప్పుడు ఎంత చప్పుడు వస్తుంది, దానిని సూదితో పొడిచినప్పుడు ఎన్ని డెసిబుల్స్ ఉత్పత్తి అవుతాయి, బెలూను పేలేదాకా నొక్కినప్పుడు ఎంత శబ్దం వస్తుంది అంటూ లెక్కలు వేశారు.

 


బెలూను పేలేదాకా ఊదుతూ ఉంటే కనుక వచ్చే చప్పుడు అంతా ఇంతా కాదని తేలింది. ఆ సమయంలో ఏకంగా 168 డెసిబిల్స్ చప్పుడు నమోదు అయ్యిందట. వివిధ శబ్దాల తీవ్రతను మనం డెసిబుల్స్‌లో కొలుస్తామన్న విషయం తెలిసిందే కదా! ఈ డెసిబుల్స్ స్థాయి కనుక 140 పాయింట్లను దాటితే వినికిడి సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. అలాంటిది ఏకంగా 168 డెసిబుల్స్ శబ్దాన్ని అకస్మాత్తుగా వినడం అంటే.... కోరి కోరి చెవుడుని తెచ్చుకున్నట్లే! చెవి పక్కన ఒక తుపాకీ పేలినప్పుడు వచ్చే శబ్దం కంటే (165 డెసిబుల్స్) ఈ శబ్దం ఎక్కువ కావడం గమనార్హం. బెలూన్‌ని సూదితో పేల్చినా, కేవలం ఒత్తిడి వల్ల అది పేలినా కూడా తీవ్రమైన శబ్దాలు ఉత్పన్నం అవుతున్నట్లు గమనించారు.

 


ఒక్కసెకనుపాటు బెలూను పేలుడు శబ్దాన్ని విన్నా కూడా శాశ్వతంగా వినికిడి లోపం తలెత్తే అవకాశం ఉంది. సదరు శబ్దానికి మన చెవి అంతర్భాగాలలో ఉండే కేశాలు దెబ్బతినడం వల్ల ఇలాంటి సమస్య ఏర్పడుతుంది. కాబట్టి పార్టీలో ఆకతాయితనానికి పోయి బెలూన్లను పగలకొట్టడం మానుకోవాలి. ఇంట్లో పార్టీ చేసుకునే ముందు కూడా ఈ విషయమై పిల్లలకు స్పష్టమైన హెచ్చరికను అందించాలి. బెలూన్లను ఊదేటప్పుడు కూడా ఓ స్థాయికి మించి ప్రయత్నించకూడదు, లేదా చెవిలో దూది పెట్టుకునన్నా ఊదాలి. కాదూ కూడదూ అనుకుంటే!!!

 

- నిర్జర.