బులెట్ రాణి: యువతి శరీరంలో దొరికిన బులెట్.....
posted on Dec 24, 2019 @ 10:26AM
యువతి శరీరంలో బులెట్ దొరకడం హైదరాబాద్ లో సంచలనం రేపుతోంది. బహదూర్ పురా మండలం జహనుమా ప్రాంతానికి చెందిన అబ్దుల్ ఖాదర్ కుమార్తె అస్మా బేగం వెన్ను నొప్పితో రెండు నెలల క్రితం నిమ్స్ ఓపి విభాగానికి వచ్చింది. సాధారణ వెన్ను నొప్పిగా భావించిన వైద్యులు మందులు రాసి పంపారు. నెల రోజుల తర్వాత ఆమె మళ్లీ హాస్పిటల్ కి వెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో గత శనివారం వైద్యులు ఆమెకు ఎక్స్ రే తీయించారు. వెన్నుపూసలో ఎల్ 1, ఎల్ 2 భాగంలో ఏదో ఫారిన్ బాడి ఉన్నట్టు గుర్తించారు. దాన్ని బయటకు తీయడానికి శస్త్ర చికిత్స చేయగా తుపాకీ తూటా బయటపడింది. దీంతో దీనిని మెడికో లీగల్ కేసుగా భావించి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించేశారు. బుల్లెట్ ఆమె శరీరం లోకి ఎలా వచ్చింది అనే విషయాన్ని ఆపరేషన్ చేసిన తర్వాత కూడా తెలపలేదని హాస్పిటల్ వర్గాలు పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాయి.
ఆమె శరీరంలో తూటా ఏడాదిన్నరగా వుందని పోలీసులే చెబుతున్నారు. బాధిత యువతి ఫలక్నుమా ప్రాంతానికి చెందినది కావడంతో అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. రెండు, మూడు రోజుల్లో కేసును చేధిస్తామని సిపి అంజనీ కుమార్ తెలిపారు. అయితే అస్మా బేగం కుటుంబ సభ్యులు మాత్రం రెండేళ్ల క్రితం ఆమె పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఒకవేళ వారు చెప్పినట్లు రెండేళ్ల క్రితం నిజంగానే కాల్పులు జరిపి ఉంటే పోలీసులకు అప్పట్లోనే ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. తూటా శరీరంలోకి దూసుకెళ్తే గాయమవుతుంది. ఆ గాయానికి వైద్యం ఎక్కడ చేయించారు అనే ప్రశ్నలకు సమాధానం లేదు. అంతేకాదు యువతి తండ్రి కానిస్టేబుల్ గా పని చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వ్యవహారం వెనుక అతని పాత్ర పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రేమ వ్యవహారమని యువతి పై ప్రియుడు కాల్పులు జరిపాడనే వాదన కూడా వినిపిస్తోంది