ఎనిమిది కాళ్ల దూడ.. బ్రహ్మం గారు చెప్పిందే జరిగిందా?
posted on Dec 24, 2022 @ 4:29PM
బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది.. అన్నది చాలా పాపులర్ పాట. దేశంలో ఏ వింత జరిగినా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అనడం కద్దు. సరిగ్గా అలాంటి వింతే తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన దేవిశెట్టి రత్నాజీ అనే రైతు కు చెందిన గెదె ఓ దూడకు జన్మనిచ్చింది. ఆ దూడను చూసిన వారంతా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు ఇలాంటి వింతలు జరుగుతాయని, వింత జననాలు సంభవిస్తాయనీ అంటున్నారు.
ఇంతకీ ఆ దూడ ప్రత్యేకత ఏమిటంటే దానికి ఎనిమిది కాళ్లు ఉన్నాయి. సాధారణంగా దూడకు నాలుగు కాళ్లే ఉంటాయి. అలాంటిది ఈ దూడ ఎనిమిది కాళ్లతో జన్మించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ వింత దూడను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు. ఆ దూడకు సంబంధించి వీడియో సమాజిక మాధ్యమంలో వైరల్ అయిపోయింది.
అయితే పశువైద్యులు మాత్రం ఇదేం వింత కాదనీ, బ్రహ్మం గారి జోస్యం అంతకన్నా కాదనీ అంటున్నారు. జన్యు లోపాలతో ఆవు, గేదె వంటి జంతువులకు ఇలాంటి దూడలు జన్మించడం అరుదే కానీ, వింతేమీ కాదని చెబుతున్నారు. ఇలాంటి జన్యు లోపాలతో పుట్టిన దూడ ఎక్కువ కాలం బతకదని కూడా పశువైద్యులు చెబుతున్నారు.