చెప్పేదొకటి.. చేసేదొకటి.. అంతా జగన్మాయ!
posted on Dec 24, 2022 @ 5:12PM
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ ఏం చెబుతుందో అది చేయదు.. ఏం చెప్పలేదో... అది చేస్తుంది. మాట ఒకటి.. చేత ఒకటి ఇది గతంలో పలు సందర్భాలలో రుజువైంది. అయితే జగన్ సర్కార్ తమ విధానమంటూ చెప్పుకు వస్తున్నమూడు రాజధానుల విషయంలో కూడా ద్వంద్వ ప్రమాణాలే పాటిస్తోందనీ తేటతెల్లమైపోయింది.
విశాఖ పాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని అంటూ జగన్ ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ ఉట్టి నీటి మూటలేనని తేలిపోయింది. గతంలో కర్నూలులో ఏపీ జ్యుడీషియల్ అకాడమీ అంటూ జారీ చేసిన జీవోను ఇప్పుడు రద్దు చేసింది. ఆ జ్యుడీషియల్ అకాడమీని మంగళగిరిలోనే ఏర్పాటు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసంది. జీవో అయితే ఇక్కడే జారీ చేసింది కానీ మంగళగిరిలో జ్యుడీషియల్ అకాడమీ పనులు ఎప్పుడో ప్రారంభమయ్యాయి. హైకోర్టు నేతృత్వంలో ఆ పనులు జరుగుతున్నాయి. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.. ఈ అకాడమీని ప్రారంభిస్తారు. ఇది కూడా ఖరారైంది. అయితే కర్నూలులో ఏర్పాటు చేయదలచిన జ్యుడీషియల్ అకాడమీ కోసం జీవో కూడా జారీ చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు దానిని రద్దు చేసి మంగళగిరిలోనే ఏర్పాటు చేయడానికి కారణమేమిటన్నదానిపై పలు ఊహాగానాలు వ్యక్తమౌతున్నాయి.
కర్నూలులో జ్యుడీషియల్ అకాడమీ కోసం ఆందోళనలు చేసిన రాయలసీమ న్యాయవాదులు దానిని మంగళగిరికి తరలించేసినా ఎందుకు కిమ్మనడం లేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అసలు విషయమేమిటంటే హైకోర్టుతో సంబంధం లేకుండా జగన్ సర్కార్ కర్నూలులో జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటు అంటూ జీవో జారీ చేసేసింది. అయితే కర్నూలలో జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటుకు హైకోర్టు అనుమతి ఇవ్వలేదు.. అది మంగళగిరిలో మాత్రమే ఏర్పాటు చేయాలని విస్పష్టంగా తేల్చి చెప్పేసింది. దీంతో జగన్ సర్కార్ మరో గత్యంతరం లేక పాత జీవోను రద్దు చేసి మంగళగిరిలో జ్యుడీషియల్ అకాడమీ అంటూ తాజాగా మరో జీవో జారీ చేసింది.
వైసీపీ పెద్దలు తల నిలువుగా ఊపితే ఆందోళనలు, అడ్డంగా ఊపితే నిశ్శబ్దం పాటించే అనుయాకులు.. ఈ జీవో విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు మౌనం వహిస్తున్నారు. ఇప్పటికే సుప్రీం కోర్టుకు జగన్ సర్కార్ కర్నూలులో హైకోర్టు ప్రశక్తే లేదని తేల్చి చెప్పేసింది. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికీ.. ప్రాంతీయ విభేదాలు సృష్టించి లబ్ధి పొందడానికి మాత్రమే మూడు రాజధానుల జపం చేస్తున్నదన్న విషయం జ్యూడీషిల్ అకాడమీ జీవోతో మరో సారి తేటతెల్లమైంది.