రసకందాయంలో భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు.. మూడో రోజు వికెట్లు టపటపా
posted on Dec 24, 2022 @ 3:52PM
ఢాకా వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లు రాణించడంతో బంగ్లా 231 పరుగులకు ఆలౌటైంది. దీంతో 144 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే బంగ్లాదేశ్‌కు దక్కింది.
145 పరుగుల స్వల్పలక్ష్య ఛేదనలో భారత్ చెమటోడుస్తోంది. కేవలం 45 పరుగులకే నాలుగు వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ ఇండియా నాలుగు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే టీమ్ ఇండియా ఇంకా వంద పరుగులు చేయాలి.
అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు వికెట్ నష్టపోకుండా 7 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల విజృంభణకు టపటపా వికెట్లు కోల్పోయింది. అయితే ఒక వైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ జాకీర్ హుస్సేన్ (51), టిటన్ దాస్ (73)ల పోరాట పటిమ కారణంగా 231 పరుగులు చేయగలిగింది. టీమ్ ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు. సిరాజ్, అశ్విన్ రెండేసి వికెట్లు పడగొట్టగా, ఉనాద్కత్ కు ఒక వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 227 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 314 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.