కర్ణాటక జనతా పార్టీ ఆవిర్భావం
posted on Dec 9, 2012 @ 3:26PM
మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కర్నాటక జనతా పార్టీనీ లాంఛనంగా ప్రారంభించారు. హవేరీ పట్టణంలో భారీ బహిరంగ సభను లక్షలాది మంది అభిమానుల మధ్య నిర్వహించారు. తన మాతృ పార్టీ భారతీయ జనతా పార్టీకి సవాల్ విసిరారు. బిజెపికి దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి జనంలోకి రావాలని ఛాలెంజ్ చేశారు. రాష్ట్రంలో జగదీష్ శెట్టార్ ప్రభుత్వానికి కాలం చెల్లిందన్నారు. తన మద్దతుదారుల వల్లనే బిజెపి రాష్ట్రంలో మనుగడ సాగిస్తోందన్నారు. తనపై బిజెపి అధిష్టానం వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. తన మద్దతుదారులు ఎవరూ పార్టీ నుండి ఇప్పుడు బయటకు రారన్నారు. వారిని వైదొలగాలని తాను ఎలాంటి ఒత్తిళ్లు చేయడం లేదన్నారు. తన కారణంగానే ప్రభుత్వం నిలబడిందన్నారు.
బిజెపికి దమ్ముంటే ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా యడ్యూరప్ప హవేరీలో బహిరంగ సభను ఏర్పాటు చేసి బిజెపికి తన బలాన్ని చూపించారు. యడ్యూరప్ప సభలో వేదికపై అధికార పార్టీకి చెందిన దాదాపు పదిమంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఆయనకు మద్దతుగా అక్కడే ఉన్నప్పటికీ వేదిక పైకి రానట్లుగా చెబుతున్నారు. యడ్యూరప్ప బయటకు వెళ్లి పోవడంతో ప్రభుత్వాన్ని రక్షించుకునేందికి బిజెపి ప్రయత్నాలు సాగిస్తోంది.