జగన్ పై బ్రదర్ అనీల్ పాశుపతాస్త్రం!
posted on Feb 13, 2024 @ 2:16PM
గత ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో జగన్ విజయానికి దోహదపడిన అంశాలన్నీ ఇప్పుడు రివర్స్ గేర్ లో ఆయన ఓటమికి కారణమౌతున్న అస్త్రాలుగా మారుతున్నాయి. గత ఎన్నికలలో జగన్ విజయానికి దోహదపడిన వాటిలో ప్రధానంగా ఆయన సోదరి, వైఎస్ షర్మిల పాదయాత్ర, ప్రచారం అలాగే విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి, ఆ తరువాత సరిగ్గా ఎన్నికల ముందు జరిగిన సొంత బాబాయ్ వివేకా హత్య వంటి అంశాలు ఇప్పుడు జమరోసారి విజయం సాధించి అధికారం చేపట్టాలన్న గన్ కు ఆశకు ప్రధాన ప్రతిబంధకాలుగా మారాయని చెప్పవచ్చు.
ఔను నాడు తన అన్న అధికారం చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం కోసం కాళ్లరిగేలా తిరిగి, గొంతు చినిగేలా ప్రచారం చేసిన వైఎస్ షర్మిల ఇప్పుడు అదే అన్న ఓటమి కోసం కంకణం కట్టుకుని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టి రాష్ట్రం చుట్టేస్తున్నారు. నాడు విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి జగన్ పై జనం సానుభూతి పెరిగేలా చేయడానికి ఎంతగానో దోహదపడింది. ఇప్పుడు అదే కోడికత్తి కేసు జగన్ నాడు సానుభూతి కోసం ఆడిన డ్రామాగా ప్రజల ముందు ఆవిష్కృతమై, ఆ కేసులో నిందితుడు కోడికత్తి శ్రీను (జనుపల్లి శ్రీను) బలిపశువుగా మారారన్న భావన జనబాహుల్యంలో వ్యక్తం అవుతోంది. అలాగే వైఎస్ వివేకా హత్య ఘటన కూడా జగన్ కు సానుభూతి వెల్లువెత్తి నాటి ఎన్నికలలో విజయంలో కీలక పాత్ర పోషించింది.
అయితే ఇప్పడు ఆ కేసులో జగన్ నిందితుల పక్షాన నిలవడం, స్వయంగా సోదరి షర్మిల, వివేకా కుమార్తె డాక్టర్ సునీత కూడా వివేకా హత్యకు రాజకీయ కారణాలున్నాయనీ, కడప ఎంపీ సీటు విషయంలో వివేకా ప్రదర్శించిన పట్టుదల కారణంగానే హత్య జరిగిందని చెప్పడంతో ఇప్పుడు వివేకా హత్య కేసు జగన్ కు యాంటీ సెంటిమెంట్ గా మారింది. నిందితుల పక్షాన నిలబడిన జగన్ పై ప్రజలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా నాడు జగన్ విజయానికి దోహదపడిన అంశాలన్నీ నేడు రివర్స్ అయ్యాయి. ఆ ఆంశాలే జగన్ ను ఆయన పార్టీని గద్దె దించేందుకు వస్తున్న ఆస్త్రాలుగా మారాయి.
ఇవే కాకుండా నాడు అంటే 2019 ఎన్నికలలో జగన్ పార్టీ విజయానికి మరో అంశం కూడా ఎంతగానో దోహదపడింది. అదే షర్మిల భర్త బ్రదర్ అనీల్ కుమార్ క్రైస్తవ సంఘాలతో వరుస భేటీలు జరిపి వారిని జగన్ కు అనుకూలంగా మార్చడం. ఇప్పుడు 2024 ఎన్నికల సమయం వచ్చే సరికి అదే బ్రదర్ అనీల్ కుమార్ జగన్ కు వ్యతిరేకంగా క్రస్తవ సంఘాలతో భేటీలు నిర్వహిస్తూ వాటిని జగన్ కు వ్యతిరేకంగా ఏకం చేస్తున్నారు.
మామూలుగానే రాజకీయాలలో కులం కార్డు విజయానికి దోహదపడే అంశంగా అంతా పరిగణిస్తారు. ఇక మతం కార్డైతే తిరుగేలేని అస్త్రంగా భావిస్తారు. గత ఎన్నికలలో మతం అస్త్రాన్ని అప్పటి విపక్ష నేతకు అండగా, అప్పటి అధికార పార్టీ తెలుగుదేశంకు వ్యతిరేకంగా సంధించిన బ్రదర్ అనిల్ కుమార్ ఇప్పుడు అదే అస్త్రాన్ని జగన్ కు వ్యతిరేకంగా సంధిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన తన సతీమణి వైస్ షర్మిలకు మద్దతుగా బ్రదర్ అనీల్ కుమార్ రంగంలోకి దిగారు. నాడు జగన్ విజయం కోసం ఆయన ఏ విధంగా పని చేశారో, అదే విధంగా ఇప్పుడు జగన్ ఓటమి కోసం పని చేస్తున్నారు.
బ్రదర్ అనీల్ కుమార్ కు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవసమాజంలో ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ను గత ఎన్నికలలో బావమరిది జగన్ ని సీఎం చేయాలన్న లక్ష్య సాధన కోసం ఉపయోగించిన బ్రదర్ అనీల్ కుమారు ఇప్పుడు జగన్ ఓటమి కోసం ఉపయోగిస్తున్నారు. నాడు అనిల్ ప్రభావంతో రాష్ట్రంలోని క్రేస్తవ సమాజం మొత్తం జగన్ కు మద్దతుగా నిలిచింది. రానున్న ఎన్నికల్లో అదే అనీల్ ప్రమాభంతో రాష్ట్రంలోని క్రైస్తవ సమాజం జగన్ వ్యతిరేకంగా ఏకతాటిపైకి వస్తోంది. జగన్ పైకి మతం అనే పాశుపతాస్త్రాన్ని బ్రదర్ అనీల్ కుమార్ విశాఖ నుంచి సంధించారని చెప్పవచ్చు. ఆయన మంగళవారం విశాఖలో మత పెద్దలతో భేటీతో రాష్ట్రంలోని క్రైస్తవ మతస్థులను జగన్ కు వ్యతిరేకంగా ఏకతాటికి తీసుకు వచ్చే ప్రయత్నానికి ప్రారంభంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.