మాగుంట శ్రీనివాసులురెడ్డి అడుగులు టిడిపి వైపు ..
posted on Feb 13, 2024 @ 1:26PM
ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ పార్లమెంటు సభ్యుులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పక్క చూపులు చూస్తున్నారా? అంటే ఔననే వినిపిస్తుంది. వైసీసీలో టికెట్ లేదన్న సంకేతాలు వస్తుండటంతో తెలుగుదేశం పార్టీతో మాగుంట టచ్‌లో ఉన్నారట. అసలు సిట్టింగ్ ఎంపీ మాగుంటకు వైసీపీ టికెట్ ఎందుకు నిరాకరించినట్టు.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీ వైపు చూస్తున్నారా.. అంటే. వైసీపీలో టికెట్ రాకుంటే ఏం చేస్తాం.. మాదారి మేం చూసుకుంటాం.. అంటున్నారట మాగుంట అభిమానులు. దీంతో ఒంగోలులో వైసీపీ నుంచి పార్లమెంట్‌కు, అసెంబ్లీకి కలిసి పోటీ చేయాలని భావిస్తున్న మాగుంట – బాలినేని కాంబినేషన్‌కు ఈ ఎన్నికలు మరోసారి బ్రేక్ పడనున్నట్టు కనిపిస్తోంది. వైసీపీ టికెట్ కోసం ఆఖ రివరకు ఎదురు చూడాలని మాగుంటకు బాలినేని సూచించడంతో అందుకు అనుగుణంగానే హైదరాబాద్‌లో ఉన్న బాలినేనితో రెండు రోజుల పాటు మంతనాలు చేసిన మాగుంట చివరకు వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి సూచనలు రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ టచ్‌లోకి వెళ్ళిపోయారని భావిస్తున్నారు.
టీడీపీ నుంచి సానుకూల సంకేతాలు ఉన్నాయని, ఒంగోలు లేదా నెల్లూరు నుంచి పోటీ చేసేందుకు సిద్దంగా ఉండాలని టీడీపీ అధిష్టానం నుంచి ఇప్పటికే మాగుంట శిబిరానికి సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల బరిలో మాగుంట కుటుంబం నుంచి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీ చేయించాలని భావిస్తున్నారట. టీడీపీ అధిష్టానం కూడా మాగుంట కుటుంబానికి సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది అందుకు ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన రా కదలిరా.. ఎన్నికల శంఖారావ సభలో పరోక్షంగా మాగుంటను అభినందిస్తూ చంద్రబాబు చేసిన ప్రసంగమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు తెలుగు తమ్ముళ్ళు.