గ్యాప్ వచ్చిందా.. ఇచ్చారా! బీజేపీకి జనసేన గుడ్ బై?
posted on Jun 19, 2021 @ 11:00AM
ఎప్పటికప్పుడు క్లోజ్ అయినట్లే కనపడతారు.. ఇష్క్ ప్యార్ అంటూ డ్యూయెట్స్ పాడుకుంటారు. అంతలోనే మళ్లీ ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తారు. అవసరమున్నప్పుడు ఆయనని గబ్బర్ సింగ్ అంటారు.. అవసరం లేదనుకుంటే ఫ్లాప్ అయిన గబ్బర్ సింగ్-2 లాగా చూస్తారు. అన్నీ కలిసే చేస్తామంటారు...మళ్లీ ఎవరికి వారు సొంతంగా కథ నడిపించుకుంటారు. ఆయనే మా సీఎం అభ్యర్ధి అంటారు... ఆయనకు తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటారు. వీరిద్దరూ కలిసున్నారో... విడిపోయారో.. ఎప్పుడు కలుస్తారో.. విడిపోతారో అర్ధం కాకుండా.. జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు బిజెపి, జనసేన నేతలు.
తిరుపతి ఉప ఎన్నికల సమయంలో ఎక్కడ లేని ప్రేమాభిమానాలు ఒకరిపై ఒకరు తెగ పారబోసుకున్న బిజెపి, జనసేన నేతలు..ఆ ఎన్నికలయిపోగానే.. ఏదో షూటింగ్ ప్యాకప్ అని చెప్పినట్లే చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కరోనా వచ్చిందని కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు కొత్త సినిమాలు ఫైనల్ చేసే పనిలో ఉన్నారంటున్నారు. మరోవైపు ఆయనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతోంది. కాని రాష్ట్రంలో మాత్రం బిజెపి, జనసేనల మధ్య గ్యాప్ పెరిగినట్లే ఉంది.ఏపీలో ధాన్యం కొనుగోళ్లు జరగటం లేదని.. సరైన గిట్టుబాటు ధర ఇవ్వడం లేదంటూ బిజెపి ఆందోళనలు నిర్వహించింది. కాని ఉమ్మడిగానే ఆందోళనలు నిర్వహించాలనుకున్న రెండు పార్టీల నిర్ణయం ఏమైందో తెలియలేదు. పైగా దీని గురించి కనీసం సమాచారం కూడా జనసేన నేతలకు లేదట. దీంతో జనసేన నేతలు కాస్త గుర్రుగానే ఉన్నారు. దీనిపై ఇరు పార్టీల నేతల మధ్య ఫోన్ లో నే వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది.
మరోవైపు బిజెపి నేతలు మాత్రం పవన్ అందుబాటులో ఉండటం లేదని..కనీసం నాదెండ్ల మనోహర్ కూడా టచ్ లో లేడని..ఎవరికి చెప్పాలని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. తిరుపతి ఉపఎన్నికలో పవన్ ప్రభావం ఏమీ కనిపించలేదని..వచ్చిన ఓట్లే చెబుతున్నాయని..అలాంటి వారిని నమ్ముకుని ఎలా ముందుకు వెళతామని కొందరు బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జనసేన వర్గాలు మాత్రం..వచ్చిన ఓట్లన్నీతమవేనని.. అసలు బిజెపి ఓట్లు ఒక్కటి కూడా లేవని..ముందు అడిగినట్లు తమకే అవకాశం ఇచ్చి ఉంటే..వేరేగా ఉండేదని..వాదిస్తున్నాయి. బిజెపి రాష్ట్ర నేతలు అసలు సమిష్టిగా పని చేయడం లేదని.. ఎవరి ఇంట్రెస్టుకు అనుగుణంగా వారు పని చేస్తున్నారని.. కొందరు వైసీపీకి అనుకూలంగాను.. మరికొందరు టీడీపీకి అనుకూలంగాను ఉంటున్నారని...కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు..నిర్ణయం మేరకు జనసేనతో కలిసి పని చేసేవారు చాలా తక్కువమందే ఉన్నారని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. బిజెపి కేంద్ర నాయకత్వం కలగచేసుకుని.. వారి ఆదేశాలు,నిర్ణయాల మేరకు రాష్ట్ర పార్టీ నేతలు పని చేసేలా చూడాలని జనసేన వర్గాలు కోరుతున్నాయి.
అసలు బిజెపి నేతల వైఖరి నచ్చకనే పవన్ సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారనే టాక్ కూడా వినపడుతుంది. మరోవైపు జనసేనలోని కొంతమంది ఇప్పుడున్న పరిస్ధితుల్లో బిజెపి ఇమేజ్ తగ్గుతుందని..వైసీపీ హవా కూడా తగ్గుతుందని.. రాబోయే కాలంలో టీడీపీ బలపడే ఛాన్స్ ఉందని..అందుకే టీడీపీతో టచ్ లో ఉండాలని వాదిస్తున్నారంట. ఈ తికమక అయోమయానికి చిరాకు పుట్టే పవన్ సినిమాల వైపు బిజీ అయిపోయారనే కామెంట్లు వినపడుతున్నాయి.