నిరంకుశ పాలన నుంచి ఏపీకి విముక్తి కోసమే దేశం గూటికి!
posted on Jan 17, 2024 @ 3:49PM
జగన్ హయాంలో ఏపీలో కొనసాగుతున్నది నిరంకుశ పాలన అని విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ అన్నారు. బుధవారం (జనవరి 17) ఆయన కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ ల సమక్షంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా తాను బేషరతుగా తెలుగుదేశం గూటికి చేరుతున్నట్లు చెప్పారు. ఏపీలో నిరంకుశ పాలన అంతానికి తాను కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ రావు, బోండా ఉమ, బుద్ధా వెంకన్న, ఇతర తెలుగుదేశం నాయకులతో కలిసి నిస్వార్థంగా పని చేస్తానని అన్నారు. అలాగే తాను ఈ నెల 21న తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు చెప్పారు.
తనకు మంచి మిత్రుడైన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థ సారథితో కలిసి ఈ నెల 21న తెలుగుదేశం కండువా కప్పుకోనున్నట్లు వెల్లడించారు. జగన్ తన హయాంలో అమరావతిని నిర్వీర్యం చేశారని విమర్శించారు. రాష్ట్ర రాజధాని అమరావతే ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తి తానేనని చెప్పిన బొప్పన, తాను వైసీపీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం రాజధానికి భూములు ఇచ్చిన రైతుల కష్టాలు, రోడ్డున పడ్డ లక్షలాది కుటుంబాల ఆవేదన అని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ నిరంకుశ పాలన అంతమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీలో నిస్వార్థంగా పని చేస్తానని బొప్పన భవకుమార్ అన్నారు.