గెలిచీ ఓడిన బీజేపీ!
posted on Jun 5, 2024 @ 10:06AM
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్రంలో అధికారం కావాలంటే మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలు గెలవాలి.కాని బీజేపీ సొంతంగా 250 స్థానాలు మాత్రమే వచ్చాయి.మ్యాజిక్ ఫిగర్ కు 22 స్థానాలు తగ్గాయి. కాని ఎన్డీఏ మిత్రపక్షాలకు 41 స్థానాలు రావడంతో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు ఢోకాలేదు.
వాజపేయి ప్రభుత్వ అనంతరం 20 ఏళ్లతర్వాత ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం.. (అంటే పూర్తిగా మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడే కేంద్రంలో ప్రభుత్వ మనుగడ.) ఏర్పడనుంది. ఇది ఏ రకంగా చూసినా మంచి పరిణామమే. బీజేపీ నిరంకుశ విధానాలకు నిస్సందేహంగా కళ్లెం పడినట్లే. ఏ ప్రధాన నిర్ణయం తీసుకోవాలన్నా మిత్రపక్షాల అంగీకారం అనివార్యం. 400మార్కు దాటితే మా ఎజెండా అమలు చేస్తామన్న మోదీ ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఆచితూచి అడుగులు వేయాలి.
అటు కాంగ్రెస్ కూడా పుంజుకుంది. సొంతంగా 99 స్థానాలు సాధించడమే కాకుండా, తన నేతృత్వంలోని ఇండియా కూటమి మొత్తంగా 234 స్థానాలలో విజయం సాధించింది. అధికారం రాకపోయినా దగ్గర వరకూ రావడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ నేతలు రాహుల్,ఖర్గే వ్యాఖ్యానించారు.అధికారం రాకపోయినా రాజ్యాంగాన్ని రక్షించామని రాహుల్ చెప్పడం విశేషం. ముఖ్యంగా ఉత్తరాదిలో తగ్గిన స్థానాలకు దక్షిణాది, ఒడిసా ల్లో బీజేపీ భర్తీ చేసుకుంది. ముందుచూపుతోనే మోదీ దక్షిణాదిపై దృష్టి పెట్టడంతో కొంత వరకూ గట్టెక్కారు. మ్యాజిక్ ఫిగర్కు దగ్గరలో గెలవడంతో చావుతప్పి కన్నులోట్టపోయినట్లయింది.
కేరళలో బీజేపీ ఖాతా తెరవడం విశేషం.అలాగే ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళనాడులో బీజేపీకి దక్కింది శూన్యమే. అయోధ్య పరిధిలోని ఫైజాబాద్ నియోజకవర్గంలో పరాజయం బీజేపీ పరాజయం పాలు కావడం.. రామభక్తి రామభక్తే, రాజకీయం రాజకీయమే అని జనం కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లైంది. అలాగే ఒడిశాలో పట్నాయక్ పార్టీ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచినది. అసెంబ్లీలో కూడా గెలిచి తొలిసారిగా ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. తెలంగాణలో ఎనిమిది స్థానాలు సాధించింది. ఏపీలో మూడు స్థానాలు గెలిచింది.రాహుల్ గాంధీ రెండుచోట్లా గెలిచారు. అమేథిలో కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తంగా బీజేపీకి ఈ ఫలితాలు ఒక స్పష్టమైన హెచ్చరికగా మిగులుతాయి. ఒళ్లుదగ్గర పెట్టుకుని పని చేయమని జనం స్పష్టమైన సూచన చేశారనే భావించాల్సి ఉంటుంది.