టీటీడీకి జవహర్‌రెడ్డి! కీలక పోస్టులన్ని వారికే.. ధర్మారెడ్డి దారెటు?
posted on Oct 1, 2020 @ 2:32PM
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో పోస్టు విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీటీడీ నూతన ఈవోగా ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్‌రెడ్డిని నియమించే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ను బదలీ చేసిన జగన్ ప్రభుత్వం.. ప్రస్తుతం అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి టీటీడీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సింఘాల్‌ను ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా పంపడంతో అదే శాఖ చూస్తున్న జవహర్‌రెడ్డిని టీటీడీకి బదిలీ చేయవచ్చంటున్నారు. జవహర్ రెడ్డి కూడా తనకు టీటీడీ ఈవో పోస్ట్ ఇవ్వాలని జగన్ ను కోరుతున్నారట. దీంతో సీనియర్ ఐఏఎస్ జవహర్ రెడ్డి టీటీడీకి వెళ్లడం ఖాయమేననే తెలుస్తోంది.
రాష్ట్రంలో ఏ ప్రాధాన్యమైన పోస్టు ఖాళీగా ఉన్నా అది రెడ్లకే ఇవ్వడం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. అదే క్రమంలోనే మరో రెడ్డికి కీలక పోస్టు ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో జగన్ సర్కార్ వచ్చాకా భర్తీ చేసిన కీలక పోస్టుల్లో మెజార్టీ ఆ సామాజిక వర్గానికే దక్కాయనే ఆరోపణలు ఉన్నాయి. టీటీడీ చైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ధర్మారెడ్డి అదనపు ఈవోగా ఉన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే కేంద్ర సర్వీసుల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ధర్మారెడ్డిని హడావుడిగా ఏపీకి రప్పించారు. టీటీడీలో కీలక బాధ్యతలు అప్పగించారు. టీటీడీ చైర్మెన్ గా, అదనపు ఈవోగా రెడ్లు ఉండగా.. ఇప్పుడు ఈవో పోస్టును కూడా వారికే ఇవ్వడమేంటనే చర్చ భక్తుల నుంచి, ఏపీ ప్రజల నుంచి వస్తోంది. టీటీడీలో పూర్తిగా తమ సామాజిక వర్గమే ఉండేలా జగన్ ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
మరోవైపు టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి నియామకంపై చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి. అదనపు ఈవో ధర్మారెడ్డి అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. జవహర్ రెడ్డిని నియమించవద్దంటూ సీఎం జగన్ పై వారు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయినా సీఎం జగన్ టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డిని పంపిస్తే.. ధర్మారెడ్డి ఎక్కువ కాలం టీటీడీలో ఉండకపోవచ్చని, మూడు నాలుగు నెలల్లోనే వెళ్లిపోతారని టీటీడీ అధికారులే చెబుతున్నారు.
జవహర్ రెడ్డి ఈవోగా వస్తే టీటీడీలో చాలా మార్పులు జరుగుతాయని భావిస్తున్నారు. చైర్మెన్, అదనపు ఈవోల మధ్య విభేదాలు పెరిగి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల టీటీడీ నిర్ణయాలు చాలా వరకు వివాదాస్పదమయ్యాయి. టీటీడీ డిక్లరేషన్ పై ఇటీవలే పెద్ద వివాదం జరిగింది. సీఎం జగన్ తీరుకు నిరసనగా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. అయినా జవహర్ రెడ్డిని ఈవోగా జగన్ సర్కార్ నియమించాలనుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల మధ్య కోల్ట్ వార్ తో మరిన్ని సమస్యలు రావచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.