ఆమ్ ఆద్మీ డిల్లీలో మళ్ళీ పోటీకి సై!
posted on Jan 15, 2015 @ 7:01PM
డిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి ఏడున మళ్ళీ ఎన్నికలు జరుగనున్నాయి. క్రిందటిసారి అపూర్వమయిన ప్రజాధారణ పొందిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలిచేసి ఏకంగా దేశాన్నే ఏలేద్ధామనే దురాశతో ముఖ్యమంత్రి పదవి వదులుకొని, ప్రభుత్వాన్ని రద్దు చేసుకొన్నందుకు తగిన ఫలితం అనుభవించారు. కానీ ఆయన చేసిన తప్పు కారణంగానే డిల్లీలో మళ్ళీ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈసారి తమ పార్టీకి ఓటు వేసి గెలిపించినట్లయితే అటువంటి పొరపాటు మళ్ళీ చేయబోనని ఆయన పదేపదే ప్రజల ముందు లెంపలు వేసుకోవలసి వస్తోంది. రాజకీయాలలో అటువంటి తప్పులు చేసినవారికి మళ్ళీ అధికారం దక్కడం చాలా కష్టమేనని భావించవచ్చును.
కానీ ఇటీవల రెండు ప్రముఖ సంస్థలు డిల్లీలో గల 70 నియోజక వర్గాలలో నిర్వహించిన సర్వేలలో 35శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ సరయిన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా అమ్ ఆద్మీ పార్టీకి ఇప్పటికీ దాని 39 శాతం ఓటు బ్యాంకు పదిలంగానే ఉన్నట్లు స్పష్టమయింది. కానీ ఈసారి డిల్లీలో 40 శాతం ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అంటే ఈసారి ఎన్నికలలో పోటీ ప్రధానంగా బీజేపీ- ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యనే హోరాహోరిగా సాగబోతోందని స్పష్టం అవుతోంది.
ఇండియా టుడే ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో డిల్లీ శాసనసభలో ఉన్న మొత్తం 70 సీట్లలో బీజేపీకి-34 నుండి 40 వరకు, ఆమ్ ఆద్మీ పార్టీకి 25 నుండి 31 కాంగ్రెస్ పార్టీకి కేవలం 3 నుండి 5 సీట్లు మాత్రమే రావచ్చని తేల్చి చెప్పింది. బీజేపీకి మోడీ, ఆయన పరిపాలనే సానుకూలాంశాలు. ఈరోజు బీజేపీలో చేరిన మాజీ ఐ.పి.యస్. అధికారిణి కిరణ్ బేడీని బీజేపీ తమముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినట్లయితే బీజేపీ విజయావకాశాలు ఇంకా మెరుగుపడవచ్చును.
ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాలే ప్రధాన బలమని చెప్పవచ్చును. ఆయన తన 49 రోజుల పాలనలో తీసుకొన్న కొన్ని సాహసోపేతమయిన నిర్ణయాలు కూడా ఆయనక పార్టీకి కలిసి వచ్చే అంశాలుగానే చెప్పుకోవచ్చును. కానీ ప్రజలు ఆయనకి ఎంతో నమ్మకంతో అధికారం కట్టబెట్టినప్పటికీ, ఆయన బాధ్యతగా వ్యవహరిస్తూ తన సమర్ధతను, తన ప్రభుత్వ సమర్ధతను నిరూపించుకొనే బదులు, రోడ్ల మీద నిరసన దీక్షలు చేపట్టి చివరికి కోర్టుల చేత మొట్టి కాయలు వేయించుకోవడం, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీపై అవినీతి ఆరోపణల కేసులో బెయిలు తీసుకోవడానికి నిరాకరించి వారం రోజులు జైల్లో గడపడం వంటి అంశాలు ఆయనకు తీవ్ర ప్రతికూలాంశాలుగా నిలుస్తాయి.
ప్రధాని నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రచార సభలలో ఇవే అంశాలను ప్రస్తావిస్తూ ప్రజలను తన వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తుండటం గమనిస్తే, అరవింద్ కేజ్రీవాల్ ఆనాడు ఆవిధంగా వ్యవహరించి ఎంత పెద్ద తప్పు చేసారో స్పష్టమవుతోంది. కానీ, నేటికీ ఆయన బీజేపీకి గట్టి పోటీ ఇవ్వబోతునట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. గనుక ఈ ఎన్నికలలో గెలిచేందుకు బీజేపీ మరింతగా కృషి చేయవలసి ఉంటుంది. ఈ ఎన్నికలలో గెలవడం బీజేపీకి అత్యవసరం కూడా. లేకుంటే మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ ఇదివరకు యూపీయే ప్రభుత్వానికి ఏవిధంగా పక్కలో బల్లెంలా వ్యవహరించారో ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా వ్యవహరించడం తధ్యం. కానీ మోడీ, అమిత్ షా ఇరువురూ చేతులు కలిపి ఇప్పటికే అనేక రాష్ట్రాలలో తమ పార్టీని గెలిపించుకొన్నారు కనుక డిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడం ఖాయమనే భావించవచ్చును.