లీటర్ పెట్రోల్ రూ.50కే.. బీజేపీ నేత అద్భుత సలహా..!
posted on Aug 20, 2021 @ 8:13PM
సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర ప్రజల పైసలు పీల్చేస్తోంది. పెరుగుడే కానీ తగ్గుడు తెలీదన్నట్టు పైపైకి ఎగుస్తోంది. పెట్రోల్ మంట కంటే.. పెట్రోల్ ధరనే ఎక్కువగా మండుతోంది. ఇంధన ధరల పెరుగుదల బీజేపీ ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేస్తోంది. కమలనాథులు ఎక్కడ కనిపించినా.. పెట్రోల్ రేట్లపైనే విరుచుకుపడుతున్నారు జనాలు. తాజాగా, ఓ జర్నలిస్ట్ బీజేపీ నాయకుడిని ఇదే అంశంపై ప్రశ్నించారు. అందుకు ఆ బీజేపీ నేత ఇచ్చిన ఆన్సర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ లీడర్ నోటిదురుసుపై నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని కట్ని జిల్లా బీజేపీ నేత రామ్‌రతన్ పాయల్‌ను పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. అంతే, ఆ నాయకుడికి తెగ కోపం వచ్చేసింది. కస్సుమంటూ ఆ రిపోర్టర్‌పై చెలరేగిపోయారు. ఇంతకీ ఆయనేమన్నారంటే...
‘‘అఫ్గానిస్థాన్ వెళ్లవయ్యా. అక్కడైతే లీటర్ పెట్రోల్ 50 రూపాయలకే దొరుకుతుంది. వెళ్లి అక్కడే పోయించుకుని రా. అక్కడ ఎవరూ పోయించుకోవడం లేదు కూడా. ఇక్కడైతే కనీసం పెట్రోల్ పోయించుకునే స్వేచ్ఛ ఉంది’’ అంటూ మండిపడ్డారు. అక్కడితో ఆగలేదు ఆయన.. తన వాగ్ధాటిని కంటిన్యూ చేస్తూ....
‘‘ఇప్పటికే రెండు దశల్లో కరోనా విజృంభణతో దేశం అల్లాడిపోయింది. దేశం అసలే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మూడో దశ వస్తుందని కూడా చెబుతున్నారు. ఈ టైమ్‌లో పెట్రోల్ గురించి మాట్లాడతావేంటయ్యా!’’ అంటూ ఆ జర్నలిస్ట్‌కు క్లాస్ ఇచ్చారు. ఇంధన ధరల పెరుగుదలపై కేంద్రంపై జనాలు భగ్గుమంటుంటే.. ఆ ఫ్రస్టేషన్‌ను తట్టుకోలేక కమలనాథులు ఇలా ప్రశ్నించే వారిపై ఫైర్ అవుతున్నారు. ఆ సందర్భంగా ఇలా నోటికొచ్చినట్టు వాగుతూ.. మరింత విమర్శల పాలవుతూ.. బీజేపీని మరింత బద్నామ్ చేస్తున్నారు.
మరో విషయం ఏంటంటే.. ఆ బీజేపీ నేత కనీసం మాస్కు కూడా పెట్టుకోలేదు. ఆయన చుట్టూ ఉన్న అనుచరులు సైతం మాస్కులు ధరించలేదు. కానీ, ప్రజలెవరూ కొవిడ్ నిబంధనలు పాటించడం లేదంటూ ఆ మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుడు ఇచ్చిన స్పీచ్‌పై నెటిజన్లు కామెంట్లతో కుళ్లబొడుస్తున్నారు.