కరోనాను ఇలా కడిగేయండి.. ICMR-NIN సూచనలు..
posted on May 25, 2021 @ 12:42PM
కరోనా కాలంలో అనేక సందేహాలు.. అంతకుమించి అనుమానాలు. ఏది తినాలి? ఏది తినకూడదు? అనేదానికన్నా.. ఎలా తినాలి? ఎలా తెచ్చుకోవాలి? ఎలా వండుకోవాలి? అనే డౌట్సే ఎక్కువ. కూరగాయలు కొనాలంటే ఎక్కడ వైరస్ అంటుకుంటుందోననే భయం. తెచ్చిన కూరగాయలను వైరస్ లేకుండా ఎలా శుభ్రం చేసుకోవాలో తెలీక ఆందోళన. పాల ప్యాకెట్ పట్టుకోవాలంటే టెన్షన్. వేటిని తాకకూడదో.. వాటిని ఎలా భద్రపరచాలో.. ఇలా అనేక అనుమానాలు. ఆహారం ద్వారా కరోనా వస్తున్న దాఖలాలు లేకపోవడం కాస్తలో కాస్త ఉపశమనం కలిగించే అంశం. ఇలాంటి తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుపుతూ.. జాతీయ పోషకాహార సంస్థ పలు సూచనలు చేసింది.
--కూరగాయలపై చేతితో నీళ్లు పోస్తూ కడగడం కంటే.. టాప్ ద్వారా ప్రెజర్‌తో వస్తున్న నీటితో కూరగాయలు, పండ్లను కడగాలి. వాటర్ ప్రెజర్ ఎంత ఎక్కువుంటే అంత మంచిది. గోరు వెచ్చని నీటిలో క్లోరిన్ కలిపి అందులో ముంచి కడిగితే మరింత బెటర్.
--మాంసం కూడా టాప్ ద్వారా వచ్చే నీటిలో కడగాలి. పాలు, పెరుగు ప్యాకెట్లను కూడా అలానే శుభ్రపరచాలి. వాటిని పొడి వస్త్రంతో తుడిచి.. తడి ఆరాక వాడుకోవాలి. శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాతే.. కూరగాయలను, పండ్లను, మాంసాన్ని, పాలప్యాకెట్లను ఫ్రిజ్‌లో భద్రపరచాలి. కోడి గుడ్లు సైతం అంతే. పగిలిన గుడ్లను ఫ్రిజ్‌లో అస్సలే ఉంచరాదు.
--కూరగాయలు, పండ్లు తెచ్చిన వెంటనే అంతా వాటిపై శానిటైజర్ చల్లుతున్నారు. ఇది ఏమాత్రం మంచి పద్దతి కాదంటున్నారు నిపుణులు. శానిటైజర్ నేరుగా కూరగాయల మీద చల్లవద్ధు. అలా చల్లితే కూరగాయలు, పండ్ల ద్వారా మరింత హాని కలుగుతుందట.
--ఆన్‌లైన్లో ఫుడ్ ప్యాకెట్స్ తెప్పించుకుంటే ఆ ఆహారం ప్యాకెట్లను శానిటైజ్ చేయాలి. అయితే ఆహారంపై పడకుండా చూసుకోవాలి. పై కవర్లను తీసి చెత్తకుండీలో వేయాలి. తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కొవాలి. వేడి పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు.. చల్లటివి చల్లగా ఉన్నప్పుడే తీసుకోవాలి.
--కూరగాయలు, పండ్లు కొనేటప్పుడు మీరు సొంతంగా చేతి సంచిని తీసుకెళ్లండి. మీకు కావాల్సిన కూరగాయలపైన మాత్రమే తాకండి. ఎప్పుడూ తాజా కూరగాయలు మాత్రమే కొనాలి. మీరు తీసుకున్న కూరగాయలు మీ శరీరానికి, దుస్తులకు తగలకుండా జాగ్రత్తగా సంచిలో వేసి ఇంటికి తీసుకురావాలి. మాంసం కొంటే.. అప్పుడే తాజాగా కోసిన మాంసాన్నే కొనండి.
--మార్కెట్ నుంచి ఇంటికి వచ్చాక మీ చేతులు సబ్బుతో బాగా శుభ్రం చేసుకోవాలి. 40 నుంచి 60 సెకన్ల పాటు సబ్బుతో బాగా రుద్దుకోవాలి. శాకాహారం, మాంసాహారం శుభ్రం చేశాక చేతులు మరోసారి కడుక్కోవాలి.
--ఇగురు కూరలు, కూరలు, పప్పులు, అన్నం ఇలా ఫ్రిజ్‌లో ఉంచాలంటే.. వేటికవి గాలి లోనకు చొరబడని విధంగా మూతలు పెట్టి 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా ఫ్రిజ్‌ను చూసుకోవాలి.
--వండి ఫ్రిజ్‌లో భద్రపరచిన కూరలు, పప్పులు ఫ్రిజ్‌లోంచి తీసి వెంటనే వేడి చేసుకోవాలి.. సాధారణంగా బయట కాస్త సమయం ఉంచి వేడి చేయాలనుకోవడం మంచిది కాదు.
--చేతి వేళ్లకు ఉన్న గోళ్లలో వైరస్ చేరే ప్రమాదం ఉన్నందున గోళ్లను ఎప్పడికప్పుడు కట్ చేసుకోవాలి. ఏ వస్తువు ముట్టుకున్నా.. చేతులు శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు.