ఓటు వేయని మీరాకుమార్!
posted on Apr 10, 2014 @ 5:34PM
ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ భారీ స్థాయిలో ప్రచారం చేస్తూ వుంటుంది. ఓటు అనేది హక్కు కాదు బాధ్యత అని స్టేట్ మెంట్లు ఇస్తూ వుంటుంది. అయితే ఇవన్నీ సామాన్య ప్రజలకు చెప్పే నీతులు. బాధ్యత కలిగిన వారు ఓటు వేయకుండా తప్పించుకుంటున్నరు. ఇక సామాన్య ప్రజల సంగతి చెప్పేదేముంది? లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ గారు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. బీహార్‌లోని ససారం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మీరాకుమార్ గతంలో రెండుసార్లు ఇక్కడి నుంచి లోక్‌సభకు ఎంపికయ్యారు. ముచ్చటగా మూడోసారి కూడా గెలవాలన్న ఉద్దేశంతో పాపం కష్టపడి ప్రచారం చేస్తున్నారు. ఆమె ఓటేమో ఢిల్లీలో వుంది. ఢిల్లీకి ఫ్లయిట్‌లో వెళ్ళి ఓటు వేసే తీరిక కూడా లేనంతగా ప్రచారం చేస్తున్న మీరాకుమార్ గారు ఓటు వేయడం కంటే ప్రచారం చేసుకోవడమే ముఖ్యమనుకుని ఓటు వేయలేదు. లోక్‌సభ స్పీకర్ స్థానంలో వుండి ఓటు వేయకుండా ఊరుకున్న మీరాకుమార్ ధోరణిని ప్రజాస్వామ్యవాదులు గర్హిస్తున్నారు.