కేసీఆర్ కుటుంబ అవినీతిపై విచారణ ! బీజేపీ పెద్దలకు ఈటల కండీషన్...
posted on Jun 1, 2021 @ 10:13AM
కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన సీనియర్ నేత ఈటల రాజేందర్... తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ఆయన చేరబోతున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు, ఉద్యమ నేతలతో ఉమ్మడి వేదిక, కాంగ్రెస్ లో చేరిక వంటి ఆప్షన్లను పరిశీలించిన ఈటల రాజేందర్.. చివరికి కమలం గూటికి చేరబోతున్నారు. ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీ పెద్దలతో మంతనాలు సాగించారు. కాషాయ పెద్దల నుంచి స్పష్టమైన హామీ తీసుకున్న ఈటల.. హైదరాబాద్ వచ్చాక అధికారికంగా చేరిక విషయాన్ని ప్రకటించబోతున్నారు. తనతో పాటు తనతో వస్తున్న నేతల భవిష్యత్ కు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ భరోసా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కేంద్రానికి కొన్ని షరతులు కూడా రాజేందర్ పెట్టారని. వాటిపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సానుకూలంగా స్పందించారని అంటున్నారు.
తనను మంత్రివర్గం నుంచి అవమానకరంగా తొలగించారనే కసిగా ఉన్న ఈటల రాజేందర్... కేసీఆర్ టార్గెట్ గానే ముందుకు వెళ్లనున్నారని తెలుస్తోంది. బీజేపీ చీఫ్ ముందు ఈటల రాజేందర్ పెట్టిన కండీషన్లు కూడా కేసీఆర్ లక్ష్యంగానే ఉన్నాయని అంటున్నారు. రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకు ఒక్క విచారణ కూడా చేపట్టకపోవడాన్ని ప్రజలు అనుమానిస్తున్నారని రాజేందర్ చెప్పారట. దానికి బదులిచ్చిన జేపీ నడ్డా.. సమయం వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబ కుంభకోణాలపై విచారణ చేపడతామని హామీ ఇచ్చారని అంటున్నారు.
రాజకీయంగా కొన్ని సందేహాలను బీజేపీ చీఫ్ ముందు ఈటల ఉంచారంటున్నారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనన్న భావన ప్రజల్లో ఉందని.. భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసి పనిచేస్తే పార్టీనే నమ్ముకుని వచ్చిన తమలాంటి వారి పరిస్థితి ఏమిటని ఈటల ప్రశ్నించినట్టు సమాచారం. ఈటల సందేహాలపై స్పందించిన జేపీ నడ్డా.. ఇందుకు పశ్చిమ బెంగాల్‌ను ఉదాహరణగా చెప్పారట. అక్కడ మూడు స్థానాల నుంచి దాదాపు అధికారం చేజిక్కించుకునే వరకు ఎదిగామని, తెలంగాణలోనూ అంతకుమించిన దూకుడు ప్రదర్శిస్తామని స్పష్టం చేశారట.
కేంద్ర ప్రభుత్వ పథకాలను తొలుత విమర్శించే కేసీఆర్ ఆ తర్వాత వాటిని అమలు చేస్తున్నారని, అలా ఎందుకో ప్రతిపక్షాలే ప్రశ్నించాలని నడ్డా సూచించారట. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నడ్డా ధీమా వ్యక్తం చేశారని చెబుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌తో బీజేపీ పోరు కొనసాగిస్తుందని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని బీజేపీ పెద్దలు రాజేందర్ కు తేల్చి చెప్పారని అంటున్నారు.