గజపతిరాజుకి బిగ్ రిలీఫ్.. కుట్రదారులకు మరో షాక్..
posted on Aug 3, 2021 @ 6:30PM
ఎంతగా బంధించాలని చూశారో.. అంతగా బంధనాలు తెంచుకుంటున్నారు. కుట్రలతో ఎన్ని కేసులు పెట్టినా.. వాటన్నిటినీ హైకోర్టులో ఎదుర్కొంటున్నారు. అక్రమ జీవోతో మాన్సాస్ ట్రస్ట్ నుంచి అశోకుడిని సాగనంపామని రెండేళ్ల పాటు పండగ చేసుకున్నారు. కానీ, కోర్టు తీర్పుతో రాజు గారు మళ్లీ మాన్సాస్ సింహాసనం అధిష్టించడంతో పాలకులు ఖంగు తిన్నారు. ఆ కళ్లమంటతోనే కాబోలు.. ప్రతీదానికి కొర్రీలు పెడుతూ గజపతిరాజు ముందరి కాళ్లకు బంధం వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మాన్సాస్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలను ఆపేశారు. బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. అందుకు, మాన్సాస్ ఈవోను పావుగా వాడుకున్నారనే ఆరోపణ ఉంది.
జీతాలు వెంటనే ఇవ్వాలంటూ మాన్సాస్ ఉద్యోగులు ఆందోళనకు దిగడం.. ఆ అంశాన్ని సైతం అశోక్‌పై రివేంజ్‌కు వాడుకోవడం వారికే చెల్లింది. అశోక్ గజపతిరాజు ప్రోద్భలంతోనే ఉద్యోగులు గొడవ చేశారంటూ ఏకంగా ఛైర్మన్‌పైనే కేసు కట్టి విమర్శల పాలయ్యారు. ఈ కేసుపైనా హైకోర్టును ఆశ్రయించారు అశోక్.
కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్‌గజపతిరాజు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అశోక్ గజపతిరాజు ప్రోద్భలంతోనే మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారని ఈవో ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
మాన్సాస్ ట్రస్టు ఈవో వేతన ఖాతాలు నిలుపుదల చేయడం పట్ల గతనెల 17న విద్యాసంస్థల ఉద్యోగులు మాన్సాస్ ఛైర్మన్‌ను కలిశారు. అనంతరం ఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీతాలు ఎందుకు నిలిపివేశారంటూ ఈవోను నిలదీశారు. ఈక్రమంలో ఈవో, ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి.. కొవిడ్ నిబంధనల ఉల్లంఘన, ఈవోపై దాడికి ప్రేరిపించారనే ఆరోపణలతో అశోక్‌గజపతిరాజుపై విజయనగరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుకాగా.. తాజా హైకోర్టు తీర్పుతో రాజుకు కాస్త ఉపశమనం లభించినట్టైంది.