ఐసీఎంఆర్ విచారణ ఉండదు! ఆనందయ్య మందుపై ఉపరాష్ట్రపతి ఆరా..
posted on May 27, 2021 @ 4:24PM
నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య మందుపై పరిశోధన పురోగతి గురించి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరా తీశారు. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజుకు ఫోన్ చేశారు. పరిశోధన పురోగతి గురించి ఉపరాష్ట్రపతికి వివరించారు కేంద్ర మంత్రి. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రాలయ పరిధిలో ఉన్న సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్) ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ఆయుష్ విభాగం వారి సహకారంతో ఆనందయ్య మందును ఇప్పటికే వాడిన 500 మంది నుంచి వివరాలు సేకరించి, పరిశోధన జరుపుతున్నామని చెప్పారు. వీలైనంత త్వరలోనే పరిశోధన పూర్తి చేసి నివేదికను సిద్ధం చేస్తామన్నారు కేంద్ర మంత్రి రిజిజు. జనబాహుళ్యానికి చెందిన అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశం కాబట్టి, ఎటువంటి వివాదాలకు తావు లేకుండా అన్ని కోణాల నుంచి పరిశోధన చేయవలసి ఉంటుందని అందువల్ల కాస్త సమయం పడుతోందని తెలిపారు. విషయంపై రాజీ పడకుండా, వీలైనంత త్వరగా పరిశోధనను పూర్తి చేస్తామని ఉపరాష్ట్రపతికి కేంద్ర మంత్రి వివరించారు.
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొ. బలరాం భార్గవ్ తోనూ ఉపరాష్ట్రపతి ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ మందు ఆయుష్ విభాగ పరిధిలోనిది గనుక, ఇప్పటికే ఆయుష్ వారి పరిశోధన ప్రారంభమై, కొనసాగుతున్న నేపథ్యంలో మళ్లీ అదనంగా ఐసీఎంఆర్ విచారణ అవసరం లేదని ఆయన ఉపరాష్ట్రపతికి తెలియజేశారు
మరోవైపు ఆనందయ్య మందు పంపిణీపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఆనందయ్య మందుపై ఆయుర్వేద కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకోలేదని కోర్టుకు ప్రభుత్వం వివరించింది. అలాగే ఆనందయ్య మందుపై పరీక్షల నివేదికలు ఈ నెల 29న వస్తాయని ప్రభుత్వం చెప్పగా.. ఆనందయ్య మందుకోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారని, వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలని ధర్మాసనం సూచించింది. మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఎలా అదేశాలు ఇస్తుందని పిటిషన్ ప్రశ్నించారు. ఆనందయ్యతో ప్రైవేట్‌గా మందు తయారు చేయిస్తున్నారని తెలిపారు. ఆనందయ్య మందును ప్రభుత్వం గుర్తించాలని పిటిషన్ వేశారని ఆనందయ్య తరపు న్యాయవాది అశ్వని కుమార్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.