మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం రేపు
posted on Oct 30, 2025 @ 6:37PM
తెలంగాణ కేబినెట్ లో అజారుద్దీన్ చేరనున్నారు. రేవంత్ కేబినెట్ లో అజారుద్దీన్ చేరికకు ముహూర్తం ఖారారైంది. శుక్రవారం (అక్టోబర్ 31) మధ్యాహ్నం 12గంటల 15 నిముషాలకు అజారుద్దీన్ మంత్రగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో ఆయన చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. అలాగే అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు తెలిపారు.
ఇలా ఉండగా అజారుద్దీన్‌కి హోం లేదా మైనారిటీ మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలియవస్తున్నది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఆయనను నామినేట్ చేసి ఇప్పుడు కేబినెట్ లోకి తీసుకుంటున్నారు. కాగా జూబ్లీ ఉప ఎన్నిక వేళ అజారుద్ధీన్ కు మంత్రి పదవి ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేయడానికేనని ఆరోపించింది. అయితే బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. మైనారిటీ వర్గాలకు మంత్రిపదవి ఇస్తుంటే బీజేపీకి అభ్యంతరం ఎందుకని డిప్యూటీ సీఎం మల్లుభట్టివిక్రమార్క అన్నారు. అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. అయితే అజారుద్దీన్ కు మంత్రిపదవిపై బీజేపీ అభ్యంతరాలు తెలుపుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తే, బీజేపీ, బీఆర్ఎస్ లు అడ్డుకోవాలని చూస్తున్నాయన్నారు. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అయిన అజారుద్దీన్ సుదీర్ఘకాలం దేశానికి సేవలందించారన్నారు. రాజస్థాన్ లో ఉప ఎన్నిక అభ్యర్థి ని బీజేపీ గతంలో మంత్రిని చేసిందని గుర్తు చేశారు. శ్రీ గంగానగర్ జిల్లా శ్రీ కరణ్ పూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా ఉన్న సురేంద్ర పాల్ సింగ్ ను ఉప ఎన్నికకు సరిగ్గా 20 రోజుల ముందు మంత్రిని చేసిందనీ, అటువంటి బీజేపీ ఇప్పుడు అజారుద్దీన్ ను మంత్రిని చేస్తుంటే ఎందుకు అభ్యంతరం పెడుతోందని ప్రశ్నించారు. మంత్రిగా అజారుద్దీన్ మైనార్టీల శ్రేయస్సుకోసం కృషి చేస్తారన్న నమ్మకముందన్నారు.