కావలి ఎమ్మెల్యేపై దాడియత్నం
posted on Oct 30, 2025 @ 6:18PM
కావలి తెలుగుదేశంలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.మాలేపాటి సుబ్బారాయుడు, మాలేపాటి భాను చందర్ ల ఉత్తర క్రియల కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కావలి కృష్ణారెడ్డిని మాలేపాటి సుబ్బారాయుడు అనుచరులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక దశలో ఆయనపై దాడికి కూడా ప్రయత్నించారు. మాలేపాటి సుబ్బా నాయుడు బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోవడానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డే కారణమంటూ ఆయన కారు అద్వాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం సీనియర్ నేతలు మాలేపాటి అభిమానులను ఆపడానికి ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. మాలేపాటి అనుచరుల నిరసనలతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే వెనుదిరిగి వెళ్లిపోయారు.
తొలి నుంచీ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ వచ్చిన మాలేపాటిని కాదని గత ఎన్నికలలో కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా వైసీపీ నుంచి వచ్చిన కావలి కృష్ణారెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు వ్యక్తిగతంగా మాలేపాటి సుబ్బారాయుడికి కీలక పదవి ఇస్తానన్న హామీ ఇచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ఆ మాట నిలబెట్టుకున్నారు. ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. పదవి అయితే వచ్చింది కానీ, నియోజకవర్గంలో ఆయన మాటకు చెల్లుబాటు లేకుండా పోయిందని అప్పటి నుంచీ మాలేపాటి అభిమానులు ఆరోపిస్తునే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో మాలేపాటి ఆస్తులపై దాడులు జరిగాయి.
ఎమ్మెల్యే నుంచి వేధింపులు పెరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. వీటితోనే మాలేపాటి తీవ్ర మనస్తాపానికి గురై అనారోగ్యం పాలయ్యారని ఆయన అభిమానులు చెబుతారు. ఆ కారణంగానే బ్రెయిన్ స్ట్రోక్ కు గురై మరణించారనీ మాలేపాటి అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన ఉత్తర క్రియలకు హాజరైన కావ్య కృష్ణారెడ్డిపై దాడి యత్నం జరిగిందని అంటున్నారు.