అయోధ్యరామ మందిరం లేఔట్ కు ఏడీఏ ఆమోదం
posted on Sep 3, 2020 @ 11:10AM
అయోధ్య రామ మందిరం భూమి పొరల్లో టైమ్ క్యాప్సూల్
రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిరం వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో అయోధ్య ట్రస్ట్ శరవేగంగా పనులు చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ భూమి పూజ చేసే నాటికే మందిర డిజైన్ మొత్తం పూర్తి అయ్యింది. భూమి పూజ తర్వాత రామ మందిర నిర్మాణం కోసం తీసుకోవల్సిన అనుమతులపై అయోధ్య ట్రస్ట్ దృష్టి సారించింది. తాజాగా రామ మందిరం లేఔట్ కు అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ(ఏడీఏ)కూడా ఆమోదం తెలపడంతో నిర్మాణ పనులు వేగవంతం చేయనున్నారు. మొత్తం లేఔట్ రెండు లక్షల 74వేల చదరపు మీటర్లు. ప్రధాన ఆలయాన్ని 12,879 చదరపు మీటర్ల విస్తీర్ణం నిర్మిస్తారు. రామ మందిరం నిర్మాణానికి సంబంధించి అన్ని శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ తీసుకున్నారు.
అయోధ్యలో మొత్తం 67 ఎకరాలను ఆలయ ట్రస్ట్ కు అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధాన ఆలయాన్ని 12,879 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తారు. మిగిలిన స్థలంలో ఆలయ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. మొత్తం మూడు అంతస్థుల్లో నిర్మించనున్నారు. అందులో గ్రౌండ్ ఫ్లోర్, మొదటి, రెండో అంతస్థులు ఉంటాయి. ఇక ఆలయ కాంప్లెక్స్‌లో ఓ నక్షత్ర వాటికను కూడా నిర్మించనున్నారు. ఇందులో మొత్తం 27 నక్షత్ర వృక్షాలను నాటుతారు. ఇక ప్రధాన రామ మందిరానికి 15 అడుగుల లోతున పునాదులు తీయనున్నారు. పూర్తిగా కాంక్రీట్‌ను ఉపయోగించి పునాదులు నిర్మిస్తారు. అయోధ్య రామ మందిరం ఎత్తు 161 అడుగులుగా ఉండనుంది.
అయోధ్య రామ మందిరం భూమి పొరల్లో టైమ్ క్యాప్సూల్ ( టైమ్ కాప్స్యూల్ అనేది ఒక డివైస్. ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేస్తారు. ఇది భవిష్యత్ తరాలకు సమాచారాన్ని అందించే ప్రయత్నం)పెట్టబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం రాలేదు.