మళ్లీ ఢిల్లీకి కవిత.. అరెస్టేనా?
posted on Mar 14, 2023 @ 2:49PM
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పుడు అందరి దృష్టీ ఈడీ దర్యాప్తుపైనే కేంద్రీకృతమై ఉంది. మరో రెండు రోజుల్లో (మార్చి 16) ఈడీ కవితను మరోమారు విచారించనుంది. తొలి సారి కవితను విచారించిన సందర్బంగా అటు ఢిల్లీలో, ఇటు తెలంగాణలో హై డ్రామా నడిచింది. ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో సౌత్ గ్రూపు పాత్రపై కవితను తదుపరి విచారణ సందర్భంగా లోతుగా ప్రశ్నించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురి వాంగ్మూలాలు రికార్డు చేసిన ఈడీ ఇక ముందు ముందు దర్యాప్తును మరింత ముమ్మరం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఈ కేసు ఒక కొలిక్కి రావాలంటే సౌత్ గ్రూప్ ప్రమేయాన్ని పకడ్బందీగా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుందన్నది ఈడీ భావనగా న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఆ దిశగా ఇప్పటికే కొంత మేర పురోగతి సాధించిన ఈడీ ఈ గ్రూపుతో సంబంధం ఉన్న అరబిందో ఫార్మా ఫుల్‌టైమ్ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవను అరెస్టు చేసింది. అలాగే ఇప్పటికే ఒక సారి విచారించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రెండో మారు విచారించనుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సౌత్ గ్రూపుదే కీలక పాత్ర అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన ఈడీ.. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కిక్‌బ్యాక్ రూపంలో ముడుపులు అందినట్టు కూడా నిర్ధారించుకుందని అంటున్నారు. ఆ సొమ్ము ఎలా చేతులు మారిందన్న విషయంపై ఇప్పుడు దృష్టి కేంద్రీకరించిందని చెబుతున్నారు. దీంతో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు జోరు పెంచింది. బ్యాంకు స్టేట్‌మెంట్లు, కంపెనీల ఆడిట్ రిపోర్టులు, వ్యక్తిగత ఆస్తుల వివరాలు, ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన ఐటీ రిటర్నులు తదితరాలన్నింటినీ సమర్పించాల్సిందిగా సౌత్ గ్రూప్ సభ్యులకు చెబుతోంది. వాటి ఆధారంగానే విచారణ కొనసాగిస్తోంది. ఆధారాలను ఒక్కొక్కరి ముందు పెట్టి విడివిడిగా విచారణ తరువాత ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టి విచారించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
అందులో భాగంగానే పిళ్లై కస్టడీని పొడిగించాలని కోరుతూ రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది సౌత్ గ్రూపులోని వ్యక్తులను మనీ లాండరింగ్ కోణం నుంచి ప్రశ్నించాల్సి ఉన్నదని, ఈ గ్రూపులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ప్రతినిధిగా ఉన్న ఆడిటర్ బుచ్చిబాబును సైతం ఈ నెల 15న ప్రశ్నించడానికి నోటీసులు ఇచ్చామనీ, అలాగే పిళ్లైని అతనితో కలిసి విచారించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. వీటన్నిటినీ బట్టి చూస్తే మద్యం కుంభకోణంలో రానున్న రోజులలో మరిన్ని అరెస్టులు అనివార్యమన్న భావనను న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఆ అరెస్టులలో కవిత అరెస్టు కూడా ఉంటుందని విశ్లేషిస్తున్నారు.