బాబు ఇచ్చారు ..జగన్ తీసేశారు!
posted on Feb 11, 2023 8:53AM
మాజీ మంత్రి, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు. ముఖ్యంగా కాపు రాజకీయాల ప్రస్తావన ఎప్పుడు వచ్చినా కన్నా పేరు ప్రస్తావనకు రాకుండా ఉండదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ మంత్రి వర్గంలో ఉన్న కన్నా.. అప్పట్లోనే కాపుల రిజర్వేషన్ అంశంలో కీలక పాత్రను పోషించారు. కాపుల ఆర్థిక, సామాజిక పరిస్థితుల అధ్యయనం కోసం కమిటి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యునిగానూ కాపుల రిజర్వేషన్ కోసం గట్టి కృషి చేశారు.
అయితే, వైఎస్సార ఆకస్మిక మృతి, తదనంతర పరిణామాల నేపధ్యంలో కాపుల రిజర్వేషన్ అంశం తెరమరుగైంది. కానీ, రాష్ట్ర విభజన అనతరం, 2014లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాపులకు న్యాయం చేశారు. కేంద్రం తెచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చట్టం చేసింది. అయితే, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడీ (వైసీపీ) ప్రభుత్వం, కేంద్రం పై నెపం నెట్టి ఆ చట్టాన్ని రద్దు చేసింది. కాపులకు అన్యాయం చేసింది. ఇదంతా చరిత్ర.
ఇప్పుడు కాపుల రిజర్వేషన్ అంశం మరోమారు చర్చకు వచ్చిన నేపధ్యంలో కన్నా చంద్రబాబు నాయుడు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేస్తే, జగన్ మోహన్ రెడ్డి కేంద్రంపై నెపం నెట్టి ఆ చట్టాన్ని రద్దు చేశారు. కాపులకు అన్యాయం చేశారు అని అన్నారు. మరో వంక ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాపుల రిజర్వేషన్ అంశాన్నే కాదు, కాపుల అభివృద్ధికి సంబందించిన ప్రతి అంశాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారని కాపు నాయకులు ఆరోపిస్తున్నారు. అంతే కాదు కాపుల వేలుతో కాపుల కంట్లో పొడిచేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని కాపు నేతలు పేర్కొంటున్నారు. అందుకే రేపటి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో చేతులు కలిపి కాపులకు న్యాయం చేయాలని అంటున్నారు.
కాగా రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతున్న సమయంలో కన్నా చేసిన తాజా వ్యాఖ్యలు దేనికి సంకేతమనే చర్చ జరుగుతోంది. నిజానికి కన్నా బీజేపీలో ఉక్కపోతకు గురవుతున్నారని అయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఆయన జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌తో చర్చలు కూడా జరిపారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఈ విషయంలో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం బీజేపీ జాతీయ నేతతో సమావేశమైన కన్నా లక్ష్మీనారాయణ.. తాను పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే అని కొట్టి వేశారు. కానీ ఇంతలోనే ఆయన కాపుల రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావిస్తూ కాపులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం న్యాయం చేస్తే, జగన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా కాపులకు రిజర్వేషన్ దక్కకుండా చేసిందని ఆరోపించడంతో కన్నా పార్టీ మారే ఆలోచన చేస్తున్నారనే ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి.
కన్నా లక్ష్మి నారయణ కాపు రిజర్వేషన్ విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పు పట్టడంతో పాటుగా బీజేపీ పట్ల కూడా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన కాపుల రిజర్వేషన్ చట్టం చెల్లు తుందని కేంద్ర తాజాగా చేసిన ప్రకటనను స్వాగతిస్తూనే ఈ క్రెడిట్ ను బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ తమ ఖాతాలో వేసుకుని, సన్మానాలు చేయించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. తప్పు పట్టారు. కేవలం రాజ్య సభలో ప్రశ్న వేయడం మినహా, కాపుల రిజర్వేషన్ కు జీవీఎల్ చేసింది ఏముందని ప్రశ్నించారు. పార్లమెంట్ లో జీవీఎల్ అడిగిన సమాచారం గురించి తెలుసుకోవాలంటే గూగుల్‌లో కొడితే అర్థమైపోతుందంటూ సెటైర్లు వేశారు.
అలాగే జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే అంశాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కే వదిలేయాలని కన్నా పేర్కొన్నారు. కన్నా చేసిన ఈ తాజా వ్యాఖ్యలను గమనిస్తే ఇక ఆయన బీజేపీలో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. అలాగే ఆయన టీడీపీ, జనసేన పొత్తును గట్టిగా సమర్ధిస్తూ పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయాల్లో ( టీడీపీతో పొత్తు) బీజేపీ జోక్యం అనవసరమని పరోక్షంగానే అయినా బీజేపీ పెద్దలకు చురకలు అంటించారు. ఈ నేపధ్యంలో ఆయన జనసేన లేదా టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోందని, పరిశీలకులు భావిస్తున్నారు.