గందరగోళాల మధ్య బిల్లు ఆమోదం
posted on Mar 29, 2011 @ 12:44PM
హైదరాబాద్ : విపక్షాల ఆందోళనల మధ్యే ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందింది. ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి మంగళవారం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బిల్లును ఆమోదించారు. దీన్ని నిరసిస్తూ విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. అనంతరం సభలో భూకేటాయింపులపై చర్చ ప్రారంభం అయ్యింది.
అంతకుముందు ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే భూకేటాయింపులపై చర్చ జరిగిన తర్వాతే ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదిస్తామని విపక్షాలు పట్టుబట్టాయి. దీనిపై ప్రభుత్వ చీఫ్ విప్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తర్వాత పూర్తి స్ధాయిలో భూకేటాయింపులపై చర్చిద్దామని తెలిపారు. భూకేటాయింపులు, హసన్ అలీ వ్యవహారంపై అవసరం అయితే సాయంత్రం వరకూ సభలో చర్చిద్దామని ఆయన పేర్కొన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అయితే విపక్షాలు భూకేటాయింపులపై పట్టుబట్టడంతో ప్రభుత్వం గందరగోళం మధ్య ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశ పెట్టింది. చివరకు ఎటువంటి చర్చ లేకుండానే బిల్లు ఆమోదం జరిగింది.