త్వరలో ఏ.పి.యస్.ఆర్.టి.సి. కూడా విభజన?
posted on Dec 13, 2014 7:06AM
రాష్ట్ర విభజన అనంతరం విభజన చట్టంలో షెడ్యుల్ 9 మరియు 10లలో ఉన్న కొన్ని సంస్థలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ) కూడా ఒకటి. రాష్ట్ర విభజనతో బాటే ఏపీఎస్‌ఆర్టీసీని విభజించడం కష్టమనే భావనతో దాని విభజనకు కొంత సమయం అవసరమనే ఆలోచనతో దానిని ఈ షెడ్యుల్ క్రింద జేర్చారు. అందువలన రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఏపీఎస్‌ఆర్టీసీ ఇంకా ఉమ్మడి సంస్థగానే నిర్వహించబడుతోంది. అయితే దాని విభజనకు చాలా కాలం క్రితమే కసరత్తు మొదలయింది. కానీ షరా మామూలుగానే దాని పంపకాల విషయంలో కూడా ఇరు రాష్ట్రాల మధ్య పేచీలు నడుస్తున్నాయి. రెండు రాష్ట్రాలలో తిరుగుతున్న వేలాది ఆర్టీసీ బస్సులు, వాటి ఆదాయం, స్థిర చరాస్తులు, అప్పుల పంపకంలో ఇరు రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. కానీ ఈ విభజన ప్రక్రియను రెండు వారాలలో ఒక కొలిక్కి తీసుకు వస్తానని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్(ఈడీ) ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లతో కూడిన ఒక ఉన్నతాధికారుల కమిటీని వేసి ఈ విభజన ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆస్తుల విభజనకు ఇరు రాష్ర్టాల నుండి మాజీ అఖిల భారత సర్వీసు అధికారులు గోయల్, కేవీ రావులతో కూడిన ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసినట్లు వెంకటేశ్వరరావు తెలిపారు. సంస్థకు మొత్తం రూ.3,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని తెలిపారు. ఈ ఆస్తులను, అప్పులను ఎవరికీ నష్టం కలగకుండా చట్టప్రకారం విభజిస్తామని ఆయన తెలిపారు.