బెజవాడలో బాబు ఆకస్మిక తనికీలు
posted on Dec 13, 2014 8:19AM
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం ఆరు గంటల నుండే విజయవాడ నగరంలో పర్యటించడం ప్రారంభించారు. నగరంలో , బందరు కాలువ, కృష్ణా నది ఒడ్డున గల 10జి.యం.డి. సామర్ధ్యం గల రక్షిత జలకేంద్రం, తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంతం పరిశీలించారు. పర్యటనలో పలు ప్రాంతాలలో అధికారులకు ఎక్కడికక్కడ అవసరమయిన ఆదేశాలు సూచనలు చేస్తూ, తన కోసం ఎదురుచూస్తున్న ప్రజలతో మాట్లాడుతూ ముందుకు సాగుతున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని హైదరాబాద్ లో రవీంద్ర భారతికి ధీటుగా తీర్చిదిద్దాలని అందుకు అవసరమయిన నిధులు, సహకారం ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలో రోడ్డు డివైడర్ సరిగ్గా లేకపోవడం గమనించిన ముఖ్యమంత్రి తక్షణమే దానిని మరమత్తులు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నగరంలోని పాత ప్రభుత్వాసుపత్రిలో ఈ.యన్.టి. కంటి విభాగం, మహిళలు, చిన్న పిల్లల విభాగాలను పరిశీలిస్తున్నారు.చాలా అధ్వానంగా ఉన్నఆసుపత్రిని చూసి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పని తీరు మార్చుకోక పోతే చర్యలు తప్పవని ఆసుపత్రి సూపరిండెంట్ ను హెచ్చరించారు.