Read more!

ఏపీ ఉన్నత విద్యా మండలిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

 

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఉన్న ఆంద్రప్రదేశ్ ఉన్నత విద్యామండలిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషనుపై ఈరోజు విచారణ జరగుతుంది. రాష్ట్ర విభజన చట్టంలో ఆంద్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి గురించి ఎటువంటి ప్రస్తావన లేదు కనుక హైదరాబాద్ లో ఉన్న ఆ సంస్థ తన ఉనికిని కోల్పోయినట్లేనని కనుక అది తెలంగాణా రాష్ట్రానికే చెందుతుందని కొన్ని రోజుల క్రితం హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆంద్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి చెందిన ఉద్యోగులు, భవనాలు, ఆసంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాలలో ఉన్న సొమ్ము అన్నీ కూడా తెలంగాణా ప్రభుత్వానికే చెందుతాయని హైకోర్టు చెప్పడంతో వెంటనే స్పందించిన తెలంగాణా ప్రభుత్వం వాటన్నిటినీ తన అధీనంలో తీసుకొంటున్నట్లు ప్రకటించింది.

 

హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలినట్లయింది. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తరువాత హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పిటిషను వేసింది. దానిపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేప్పట్టబోతోంది.ఒకవేళ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించినట్లయితే మళ్ళీ కొత్తగా ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసుకోవడం తప్ప ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి వేరే గత్యంతరం ఉండదు. కానీ సుప్రీంకోర్టు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలతో అంగీకరించినట్లయితే, మళ్ళీ ఉన్నత విద్యామండలి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికే దక్కే అవకాశం ఉంటుంది.