శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఏ.పి.ఎస్.ఆర్టీసీ చార్జీల పెంపు
posted on Oct 24, 2015 7:14AM
ఏ.పి.యస్.ఆర్టీసీ చార్జీలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి 10 శాతం పెంచుతున్నట్లు ఆర్టీసీఎం.డి. సాంభశివరావు తెలిపారు. ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర మరియు గరుడ సర్వీసులపై ఒకేసారి చార్జీలు పెరిగాయి. దాని వలన ప్రతీ కిలోమీటరుకి 8-9 పైసలు చొప్పున, పల్లె వెలుగు బస్సు సర్వీసులపై 5శాతం చార్జీలు పెంచుతున్నట్లు తెలిపారు. అయితే విద్యార్ధుల బస్ పాసుల చార్జీలు పెంచలేదు. ఇటీవల ఆర్టీసీ కార్మికులకు ఫిట్ మెంటును పెంచడంతో ఆర్టీసీపై ఏడాదికి రూ.660 కోట్ల అదనపు భారం పడుతోంది. అదీగాక సంస్థ తీవ్ర నష్టాల్లో ఉంది. కనుక తప్పనిసరి పరిస్థితులో చార్జీలు పెంచవలసి వచ్చిందని ఆయన తెలిపారు. తాము 20శాతం పెంపుకి ప్రతిపాదిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 శాతం పెంపుకు మాత్రమే అంగీకరించారని తెలిపారు. రాష్ట్రంలో సంస్థకున్న ఆస్తులను వాణిజ్యపరమయిన కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం ద్వారా సంస్థ ఆదాయం పెంచుకొని నష్టాలను అదుపు చేసుకోమని ముఖ్యమంత్రి సలహా ఇచ్చేరని ఆయన తెలిపారు. పెరిగిన ఈ కొత్త చార్జీల ప్రకారం విజయవాడ నుంచి హైదరాబాద్ కి రూ.213 ఉన్న టికెట్ ధర ఇప్పుడు రూ.235 అవుతుంది.