ఏపీ శంకుస్థాపన.. దివంగత ఎన్టీఆర్ ఎక్కడ?
posted on Oct 24, 2015 @ 11:36AM
ఏపీ నూతన రాజధాని శంకుస్థాపన కార్యక్రమం అంతా బాగానే జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా.. ఏ లోటు రాకుండా చాలా ఘనంగా నిర్వహించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎంతో మంది ప్రముఖులు, విదేశీ ప్రధానులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వగా ఇప్పుడు అందరూ చర్చించుకునే విషయం ఒకటే. అది దివంగత ఎన్టీఆర్ గురించి. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శంకుస్థాపన కార్యక్రమంలో ఎన్టీఆర్ పేరు ఎక్కడా కనిపించకపోవడం.. వినిపించకపోవడం గురించి. శంకుస్థాపన కార్యక్రమం పనులు చేపట్టిన దగ్గర నుండి ఎంతో ప్రచారం చేసినా.. ఈ శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చిన ప్రకటనల్లో చంద్రబాబు, లోకేశ్, మోడీ ఉన్నారే తప్ప ఎన్టీఆర్ ది చిన్న ఫొటో కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో చాలామంది చంద్రబాబు, లోకేశ్ తో పాటు ఎన్టీఆర్ ఫొటో కూడా ఉండి ఉంటే బావుండేదని.. ప్రకటనకే నిండుదనం వచ్చేదని అనుకుంటున్నారు. అంతేకాదు ఏపీ చరిత్రలో నిలిచిపోయే ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఎన్టీఆర్ పేరు చేర్చకపోవడం చాలా బాధాకరమైన విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది అయితే ఆఖరికి మనువడు దేవాన్ష్ తో కూడా ప్రచారం చేయించారు.. అలాంటిది తెలుగు జాతి కోసం పార్టీ పెట్టి.. ఎన్నో ఏళ్ల నుండి పాలిస్తున్న కాంగ్రెస్ ను సైతం మట్టి కరిపించి విజయం సాధించిన ఎన్టీఆర్ ను మరిచిపోయారా అంటూ విమర్సిస్తున్నారు. ఏది ఏమైనా పార్టీ స్థాపించిన నాయకుడినే మరిచిపోవడం బాధాకరమైన అంశమే.